
కదిరి టౌన్: టీడీపీ నేతలు అరాచకాలు పెచ్చుమీరిపోయాయి. కొద్దిరోజుల క్రితం కృష్ణా జిల్లా గన్నవరంలో సీఐపై టీడీపీ నేతల దాడిని మరువకముందే.. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోనూ ఒక సీఐపై ఆ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న కందికుంట వెంకట ప్రసాద్ బరితెగించారు. తన అనుచరులతో కలిసి శనివారం రాత్రి ఏకంగా పట్టణ సీఐ మధు ఇంటిపై దాడికి తెగబడ్డారు.
దౌర్జన్యాలు, భూ దందాలకు కదిరిలో కందికుంట వెంకట ప్రసాద్ పేరుగాంచారు. కదిరికి సీఐ మధు రాకతో కందికుంట అరాచకాలకు అడ్డుకట్ట పడింది. దీంతో ఆయనపై ఎలాగైనా దాడి చేయాలని కందికుంట కొన్నాళ్లుగా కుట్రపన్నుతున్నారు.
ఇప్పటికే ఒకసారి దాడికి ప్రయత్నించారు. అయినా భయపడకుండా సీఐ విధులు నిర్వర్తిస్తుండడంతో ఓర్వలేని కందికుంట.. శనివారం రాత్రి తన అనుచరులతో కలిసి కదిరి ఎన్‌జీవో కాలనీలో ఉన్న సీఐ నివాసంపైన దాడికి తెగబడ్డారు.
‘రేయ్ సీఐ మధు ఎక్కడరా నువ్వు.. రా తేల్చుకుందాం’ అంటూ నానా దుర్భాషలాడారు. ఆ సమయంలో సీఐ ఇంట్లో లేకపోవడంతో కుటుంబసభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకుని వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను పంపించేశారు. అక్కడితో ఆగని కందికుంట... మళ్లీ అనుచరులతో కలిసి సైదాపురం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో రోడ్డుపై బైఠాయించారు.
మీసాలు మెలేసి తొడకొట్టి హంగామా సృష్టించారు. దీంతో కొన్ని గంటలపాటు వాహనాలు స్తంభించిపోయాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నేతలు చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో కొందరు వైఎస్సార్‌సీపీ నాయకులకు గాయాలయ్యాయి. కందికుంటపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment