టౌన్‌ప్లానింగ్ ఏసీపీ మహాపాత్రోని తిడుతున్న సబ్బంహరి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి శనివారం రెచ్చిపోయారు. విశాఖ నడిబొడ్డున ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన ఇంటి ప్రహరీని, రెస్టు రూమ్‌ను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కూల్చివేసినందుకు అసభ్య పదజాలంతో ప్రభుత్వం, అధికారులపై విరుచుకుపడ్డారు. ‘మెడలు విరిచేస్తా.. ఒక్కొక్కడి అంతు తేలుస్తా.. నా ఈక కూడా పీకలేరు.. ఎవ్వడినీ వదిలిపెట్టను’ అంటూ చిందులు తొక్కారు. రాయడానికి కూడా వీలు లేని భాషలో, సభ్యత మరిచి నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. సబ్బం అనుచరులు కూడా అధికారులపై, కూలీలపై దౌర్జన్యానికి దిగడంతోపాటు, వారిని కులం పేరుతో దూషించి నెట్టివేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
సబ్బం హరి అక్రమాల లీలలిలా..
► విశాఖలోని రేసపువానిపాలెంలో సర్వే నంబర్ 7లో సుజనీ పార్క్ ఉంది. దీనికి ఆనుకొని ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన సబ్బం.. 2012లో గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్‌తో భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారు.
► 592.93 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టేందుకు జీవీఎంసీ ప్లాన్ మంజూరు చేసింది.
► పక్కనే రూ.3 కోట్ల విలువ చేసే 212 చదరపు గజాల పార్క్ స్థలాన్ని కబ్జా చేసేసిన సబ్బం ఆ స్థలంలో ప్రహరీ, రెస్టు రూమ్‌ను నిర్మించారు. ఈ ఆక్రమణలను గత నెల 5న ఏపీఎస్‌ఈబీ కాలనీ ప్రజలు జీవీఎంసీ దృష్టికి తీసుకెళ్లారు.
► అధికారుల కొలతల్లో ప్లాన్ ప్రకారం.. భవనం 58 అడుగులు మాత్రమే వెడల్పు ఉండాల్సి ఉండగా.. దీనికి అదనంగా 12 అడుగుల మేర ఉంది. పొడవుని లెక్కిస్తే 159 అడుగుల మేర ఆక్రమించినట్లు తేలింది.
► ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చే అధికారం ఉంది. జీవీఎంసీ ఈ నెల 2న సబ్బం ఇంటికి నోటీసులు అంటించింది. స్పందన లేకపోవడంతో శనివారం జేసీబీలు తీసుకొచ్చి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు.
► 212 చదరపు గజాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ మహాపాత్రో చెప్పారు. సబ్బం ప్లాన్‌కు దరఖాస్తు చేసినప్పుడు పార్కు స్థలాన్ని రోడ్డుగా చూపించారని, స్థానికుల ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేసి స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించి కూల్చివేశామన్నారు.
నేనేంటో అందరికీ చూపిస్తా: సబ్బం హరి
ఖాళీ స్థలంలో రెస్ట్ రూమ్ నిర్మించాను. అంతమాత్రాన రాత్రికి రాత్రి వచ్చి కొట్టేస్తారా? 24 గంటల్లో సమస్యని ముగిస్తా. నేనేంటో సీఎంకు తెలుసు.. విజయసాయికి ఇంకా తెలియదనుకుంటా. వైజాగ్‌లో కూర్చొని డ్యాన్స్ చేద్దామనుకుంటున్నారు.. ఆ డ్యాన్స్ కట్టిస్తాను. నా గురించి తెలియక ఇలా చేశారు.ఎందుకు చేశాం రా అని వాళ్లే అనుకునే స్థాయికి తీసుకెళ్తాను. వైఎస్ జగన్ నాపై కక్ష సాధింపు చేయలేరు. ఇలా చేసి మిగిలినవారికి ఒక మెసేజ్ పంపించాలని అనుకుంటున్నారు. నేనేంటో అందరికీ చూపిస్తా.
Comments
Please login to add a commentAdd a comment