బాపట్ల జిల్లాలో తమ్ముళ్ల దోపిడీ
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లాలో నాలుగున్నర టన్నులు పట్టే ట్రాక్టర్ ఇసుక రూ.9 వేలు, రూ.10 వేల చొప్పున అమ్ముతున్నారు. అంత ధర పెట్టి కొనుగోలు చేద్దామంటే కూడా నూటికి పది మందికి కూడా దొరకడంలేదు. దీంతో చాలా మంది పనులు ఆపుకున్నారు. చీరాల నియోజకవర్గంలోని పందిళ్లపల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ, అటవీ భూముల నుంచే కాక వరద కాలువ గట్లలోని ఇసుకను కూడా టీడీపీ నేత ఒకరు అక్రమంగా తరలించి అమ్ము కుంటున్నాడు.
రేపల్లె నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. వేమూరు నియోజకవర్గంలోని జువ్వలపాలెం, ఓలేరు, పెసర్లంక, గాజుల్లంక గ్రామాల పరిధిలో కృష్ణా నది నుంచి టీడీపీ నేతలు అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని కృష్ణా నది నుంచి 300 ఎద్దుల బండ్లలో ఇసుకను తరలిస్తున్నారు. వెల్లటూరు, కొల్లూరు, పెదపులివర్రు గ్రామాల సమీపంలోని కరకట్టకు వెలుపల గుట్టగా పోసి ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. బాపట్లలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పని దొరక్క తిరిగొచ్చేస్తున్నాం
నేను తెనాలి, గుంటూరులో పనులకు వెళతాను. కొంత కాలంగా ఇసుక అందుబాటులో లేక పోవడంతో సక్రమంగా పనులు జరగడం లేదు. పనికి వెళ్లిన తర్వాత ఇసుక లోడు రాకపోవడంతో పని నిలిపి వేశామని నిర్మాణ దారులు చెబుతున్నారు. రోజూ పనికి వెళ్లే వారిలో పది శాతం మందికి కూడా పనులు దొరకడం లేదు. అంత దూరం వెళ్లి ఇళ్లకు తిరిగి వస్తున్నాము.
– డి.రవీంద్రనాథ్, రాడ్ బెండింగ్ మేస్త్రీ, వరహాపురం, వేమూరు మండలం
ఉపాధి కరువైంది
మా ప్రాంతంతో పాటు తెనాలికి పనుల కోసం వెళతాము. కొంత కాలంగా ఇసుక కొరత వల్ల పనులు అందరికీ దొరకడం లేదు. పని కోసం వెళితే ఇసుక దొరకడం లేదని కట్టుబడి దారులు చెబుతున్నారు. బయట కూడా పనులు లేవు. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది.– కట్ట మరియదాసు, బేల్దార్ మేస్త్రీ, బలిజేపల్లి, వేమూరు మండలం
ప్రత్యేక సాయం ప్రకటించాలి
కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక సరఫరాలో అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నాం. ఉచిత ఇసుక విధానం అంటూ అసలు ఇసుకే లేకుండా చేశారు. దీంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నెలలో పది రోజులు కూడా పనులు దొరకని పరిస్థితి. దీంతో పస్తులు ఉండాల్సి వస్తోంది. భవన నిర్మాణ కార్మికులందరికీ ప్రభుత్వం వెంటనే ఉపాధి చూపాలి. లేదంటే ప్రత్యేక సాయం ప్రకటించాలి. – జొన్నలగడ్డ ధర్మరాజు, భవన నిర్మాణ కార్మికుడు, పేటేరు
పెనమలూరులో పెద్ద ఎత్తున లూటీ
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని యనమలకుదురులో అక్రమ ఇసుక దందా పెద్ద ఎత్తున సాగుతోంది. టీడీపీ నేతలు ఏకంగా 40 ట్రాక్టర్లును అక్రమంగా నదిలోకి దించి, పొక్లయినర్‌తో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. రోజుకు 300 ట్రిప్పులకు పైగానే తరలిస్తున్నారు. ట్రాక్టర్ రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు.
విజయవాడ నగర శివారులో ఇంతలా ఇసుక మాఫియా నదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment