సంతబొమ్మాళి: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లపై టీడీపీ నాయకులు అర్ధరాత్రి సమయంలో ప్రొక్లెయినర్లతో దాడి చేశారు. నిర్దాక్షిణ్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారు. లబ్ధిదారులను భయపెట్టి అక్కడి నుంచి తరిమేసి.. స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి మండలంలోని దండుగోపాలపురంలో గొనప సునీత, కోత అమ్మోజీ, నౌపడ తవిటమ్మ, బస్వల తులసమ్మ, బస్వల మహాలక్ష్మి, గోరుబండ తులసమ్మకు ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలు ఇచ్చింది. దీంతో వారు అక్కడ ప్రభుత్వ సాయంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే ఎప్పటి నుంచో ఈ స్థలంపై స్థానిక టీడీపీ నాయకులు కన్నేశారు. ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు చేరుకోవడంతో.. లబ్ధిదారులను భయపెట్టి అక్కడి నుంచి తరిమేసేందుకు ఇదే సరైన సమయమనుకున్నారు.
సోమవారం అర్ధరాత్రి ప్రొక్లెయినర్లతో ఆ ఏడుగురి ఇళ్ల నిర్మాణాలపై దాడి చేసి.. వాటిని కూల్చివేశారు. మంగళవారం ఉదయం అక్కడకు చేరుకున్న లబ్ధిదారులు.. నేలమట్టమైన తమ ఇళ్లను చూసి భోరున విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామస్తులంతా తిరగబడటంతో నిందితులైన టీడీపీ నాయకులు తమ ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోయారు. కాగా, ఇళ్ల కూల్చివేతపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ ఆరంగి వసంతరావు, బెండి విష్ణు, బెండి సూర్యనారాయణ, రాము, అరుణ్‌కుమార్, కైలాష్, ప్రదీప్, అనిల్, బాలక ప్రసాద్, నారాయణ, పొందల సురేశ్, మధు, ఆరంగి శ్రీధర్, హరిపై కేసు నమోదు చేసినట్లు సంతబొమ్మాళి ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment