అయ్యపరాజుగూడెంలో ఈ మరుగుదొడ్డి ఫొటో అప్‌లోడ్ చేసి అనర్హులు బిల్లులు డ్రా చేశారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తెలుగు తమ్ముళ్లు గతంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి. మరుగుదొడ్లు కట్టుకోవడానికి రుణం కోసం వెళ్లిన వారికి ఇప్పటికే మీ పేరుతో మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందంటూ అధికారులు ఇస్తున్న సమాధానంతో వారు కంగుతింటున్నారు. గత ప్రభుత్వ హయాంలో బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మారుస్తున్నామంటూ హడావుడి చేసి జిల్లా వ్యాప్తంగా వేలాది మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. దీన్ని ఆసరాగా తీసుకుని చాలా గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నేతలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి మరుగుదొడ్లు కట్టకుండానే కట్టినట్లు లెక్కలు చూపించినట్లు ఆరోపణలు వచ్చాయి. అటువంటి ఘటనే మరొకటి ఇటీవల వెలుగు చూసింది. లింగపాలెం మండలం అయ్యపరాజుగూడెం గ్రామంలో 2018లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ మరుగుదొడ్ల నిర్మాణంలో సుమారు రూ.40 లక్షల మేర దుర్వినియోగం జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. (చదవండి: ‘పశ్చిమ’లో టీడీపీకి ఎదురుదెబ్బ..)
అయ్యపరాజుగూడెం గ్రామానికి చెందిన పలువురు కొంత కాలంగా గ్రామ సచివాలయానికి వెళ్లి తాము మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు పరిశీలించగా.. వారి పేర్లతో 2018లోనే మరుగుదొడ్ల కోసం రుణం తీసుకున్నట్లు ఉంది. దీంతో వారు మీపేరు మీద మరుగుదొడ్డి తీసుకున్నట్లుగా ఉంది. అసలు తాము మరుగుదొడ్డి ఇంటి వద్ద నిర్మించుకోకుండా ఎలా బిల్లులు చేశారు. కనీసం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయరా అని ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. (చదవండి: ఆ వదంతులు అవాస్తవం: రామసుబ్బారెడ్డి)
గ్రామ టీడీపీ నేత చేతివాటం
2018లో గ్రామంలో సుమారు 266 మరుగుదొడ్ల నిర్మాణానికి ఆ గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు పి.శ్రీనివాసరావు ఓ తాపీ మేస్త్రి పేరుతో కాంట్రాక్టు పొందారు. ఒక్కో మరుగుదొడ్డి కోసం రూ.15 వేలు డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఆ సమయంలో గ్రామంలో లేనివారు, చనిపోయినవారు, మరుగుదొడ్డి నిర్మించుకోని వారి ఆధార్ కార్డుల నంబర్లను తీసుకుని వారి పేర్లు మీద మరుగుదొడ్లు నిర్మించినట్లుగా నగదును డ్రా చేసినట్లు సమాచారం. ఇది అప్పట్లో ఎంపీడీఓ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ పర్యవేక్షణలో జరిగాయి. ఈ నిర్మాణాల గురించి పట్టించుకోకుండా దొడ్లు కట్టించిన తెలుగుదేశం నాయకుడి మాటే వేదవాక్కుగా దొంగ సంతకాలు చేసి ఇచ్చిన లిస్ట్ ఆధారంగా అధికారులు బిల్లులు చెల్లించేశారు.
మొత్తం 266 మరుగుదొడ్లలో రెండు వందలకుపైగా మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసినట్టు సమాచారం. దీనిపై పూర్తి వివరాలను సచివాలయ ఉద్యోగులు సేకరిస్తున్నారు. లబ్ధిదారులు మరుగుదొడ్లు నిర్మించిన సదరు నేతను నిలదీస్తే తనకు సంబంధం లేదని, ఏం చేస్తారని బెదిరిస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్వాకం వల్ల ఇప్పుడు తాము మరుగుదొడ్డి నిర్మించుకుందామంటే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని గ్రామస్తులు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానన్నారు.
మరుగుదొడ్డి నిర్మించినట్టు రికార్డుల్లో ఉంది
మరుగుదొడ్డి నిర్మించుకుందామని గ్రామ సచివాలయానికి వెళ్లి నాపేరు అన్‌లైన్‌లో నమోదు చేయించుకోవడానికి దరఖాస్తు ఇచ్చాను. కంప్యూటర్‌లో నాపేరును నమోదు చేస్తుంటే మరుగుదొడ్డికి రుణం నేను గతంలో తీసుకున్నట్లు ఉంది. నాపేరు మీద మరుగుదొడ్డి డబ్బులు ఎవరు తీసుకున్నారని సచివాలయంలో అడగ్గా మరుగుదొడ్లు కాంట్రాక్టు చేసిన పిల్లల శ్రీను తీసుకున్నారని చెప్పారు.
– చీదరాల కృష్ణకుమారి, అయ్యపరాజుగూడెం
నిర్మించకుండానే డబ్బులు కాజేశారు
నాకు మరుగుదొడ్డి నిర్మిస్తానని చెప్పి పిల్లల శ్రీను అనే వ్యక్తి ఆధార్ కార్డు తీసుకున్నాడు. అ తరువాత వచ్చి నీ కార్డు అన్‌లైన్ కావటం లేదు దొడ్డి రాదని చెప్పారు. తీరా ఈ ప్రభుత్వంలో మరుగుదొడ్డి నిర్మించుకుందామని సచివాలయానికి వెళ్లి అడిగితే ఆధార్ నంబరు కొట్టి చూస్తే మరుగదొడ్డి కట్టినట్లుగా నాపేరు మీద రూ.15 వేలు నగదు తీసుకున్నట్లుగా ఉంది.
– యర్రా జయమ్మ, అయ్యపరాజుగూడెం
ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం
అవకతవకలు విషయం ఇప్పటి వరకు నాదృష్టికి రాలేదు. లబ్ధిదారులు ఫిర్యాదుచేస్తే రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– శ్రీదేవి, ఎంపీడీఓ, లింగపాలెం
Comments
Please login to add a commentAdd a comment