డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్యాల రత్నం, కలెక్టర్ ముత్యాలరాజు
సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు) : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు గాడిలో పడుతుందా అన్నది కీలకంగా మారింది. గత ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం ఆధ్వర్యంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. గ్యారెంటీలు లేకుండా కోట్లాది రూపాయలు రుణాలు ఇచ్చేశారు. మరోవైపు ఇష్టారాజ్యంగా కనీసం టెండర్లు పిలవకుండానే తెలుగు తమ్ముళ్లకు అవుట్‌సోర్సింగ్ పేరుతో ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇప్పటికే బ్యాంకు అక్రమాలపై విచారణ జరుగుతోంది. ఇప్పుడు పర్సన్ ఇన్‌చార్జిగా జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు బాధ్యతలు స్వీకరించడంతో అక్రమార్కులలో వణుకు మొదలైంది.
అంతా అడ్డగోలే!
గత డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం హయాంలో టెండర్లు పిలవకుండా అవుట్‌సోర్సింగ్ నియామకాలు జరిగిపోయాయి. ఎటువంటి నిబంధనలు పాటించకుండా బ్యాంకులో అవుట్‌సోర్సిం గ్ కింద సుమారు 50 మంది వరకూ పనిచేస్తున్నారు. చైర్మన్ డ్రైవర్‌ను కూడా పర్మినెంట్ చేయించుకునే ప్రయత్నం జరిగింది. చివరి జనరల్ బాడీలో తన డ్రైవర్‌ను పర్మినెంట్ చేయాలని సీఈఓకు చెప్పారు. తన పార్టీకి చెందిన వారిని ఎక్కువ మందిని నియమించుకున్నారు. పర్మినెంట్ ఉద్యోగిని ఇంటి వద్ద పనులు చేయిం చుకోవడం కోసం నియమించుకున్నారు. ఇతనిని ఆకివీడు, ఒడిశాలలో చైర్మన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వంటలు చేయడం కోసమే వాడుకున్నట్లు సమాచారం. ఇప్పుడు అతనికి వాలంటరీ రిౖటైర్‌మెంట్ ఇచ్చి అతని కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు యత్నాలు జరుగుతున్నా యి.
ఇందుకు మెడికల్ ఇన్‌వాలిడేషన్ సర్టిఫికెట్ ఉండాలి. కనీసం ఐదేళ్లు సర్వీస్ ఉంటే గానీ వాలంటరీ రిటైర్‌మెంట్‌కు అనుమతి ఇవ్వకూడదు. అయితే ఈ ఉద్యోగికి మూడేళ్లు కూడా ఇంకా సర్వీస్ లేదని సమాచారం. ఈ విధంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పటికే ముగ్గురిని బ్యాంకులో నియమించినట్టు సమాచారం. 18 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి కుమారుడికి కోర్టు ఆర్డర్ సరిగా లేకపోయినా ఉద్యోగం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు సీఈఓగా 2015లో రిటైరైన వ్యక్తిని నియమించుకున్నారు.
విచారణ గాలికి..
జిల్లా సహకార బ్యాంకులో జరిగిన కుంభకోణం విచారణ ఇంతవరకూ తేలలేదు. డీసీసీబీలో జరిగిన అక్రమాలపై ఈ ఏడాది జనవరి 18న రిజిస్ట్రార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీస్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం తనకు ఉన్న పలుకుబడితో ఇప్పటి వరకూ విచారణ పూర్తికాకుండా ఒత్తిళ్లు తెచ్చారు. ఈ పాలకవర్గం హయాంలో డీసీసీబీలో సుమారు 33.32 కోట్ల రూపాయలు సెక్యూరిటీలు లేకుండా రుణం ఇచ్చి బ్యాంకు నష్టాలకు కారణమయ్యారు. సెక్యూరిటీలు లేకుండా రుణాలు ఇచ్చి బ్యాంకు నష్టాలకు కారణమైన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులు, ఉద్యోగులపై విచారణ చేపట్టాలని జనవరిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
జనవరిలోనే విచారణకు ఆదేశించినా ఇప్పటి వరకూ నివేదిక ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివేదిక తొక్కి పెట్టేందుకు అంటూ ఒక్కో బ్యాంకు బ్రాంచి నుంచి మూడు లక్షల రూపాయల చొప్పున వసూలు చేశారు. సుమారు 34 బ్రాంచుల నుంచి ఈ డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.
కలెక్టర్ ముత్యాల రాజు బాధ్యతల స్వీకరణ
కొత్త ప్రభుత్వం డీసీసీబీకి పర్సన్ ఇన్‌చార్జిగా కలెక్టర్ ముత్యాలరాజును నియమించింది. ఆయన బాధ్యతలు స్వీకరించారు. సమర్థవంతమైన అధికారిగా పేరున్న ముత్యాలరాజు బ్యాంకు వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే మాత్రం అవకతవకలు బయటపడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment