
సాక్షి, విశాఖ : భారీ వర్షాల కారణంగా రాష్ర్టంలో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోందన్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఏ ఒక్క రైతుకు నష్టం జరగనివ్వమని మంత్రి హామీ ఇచ్చారు. అమరావతి సినిమాపై మూడు శత దినోత్సవాలను చంద్రబాబు పూర్తి చేశారని వ్యాఖ్యానించారు. వైజాగ్‌పై చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష అని ప్రశ్నించారు. సీపీఐ నారాయణ చంద్రబాబు ఎజెండాను మోస్తున్నారని, బాబు మాట్లాడిందే సీపీఐ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.
విశాఖకు టీడీపీ నేతల ద్రోహం: మంత్రి అవంతి
జిల్లాలో వరద పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారని, వర్షాలు వల్ల జిల్లాలో నష్టాన్ని అంచనా వేస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు విశాఖ రాజధాని కాకుండా ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలి అనడంలో తప్పులేదని, విశాఖ రాజధానిగా వద్దని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు బినామీలకు అమరావతి అభివృద్ధే ముఖ్యమన్నారు. అమరావతితో పాటు విశాఖ, కర్నూలు నగరాలను అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు. (చదవండి: భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం)
Comments
Please login to add a commentAdd a comment