శనివారం రాత్రి బోను వరకూ వెళ్లిన పులి
ప్రత్తిపాడు రూరల్(కాకినాడ జిల్లా): ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లో పులి దర్జాగా తిరుగుతోంది. రెండు రోజులుగా బోనులను ఏర్పాటు చేసినా పరిస్థితులను పసిగట్టిన పులి చిక్కకుండా తప్పించుకుంటోంది. శనివారం రాత్రి అది బోను వరకూ వెళ్లినా చిక్కలేదు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సీసీఎఫ్‌ఓ శరవణన్, డీఎఫ్‌ఓ ఐకేవీ రాజు, వైల్డ్ లైఫ్ డీఎఫ్‌ఓ సెల్వం, సబ్ డీఎఫ్‌ఓ సౌజన్య, స్క్వాడ్ డీఎఫ్‌ఓ ఎంవీ ప్రసాదరావు, ఐఎఫ్‌ఎస్ ట్రైనీ భరణి, రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, వైల్డ్ లైఫ్ రేంజర్ వరప్రసాద్, డీఆర్‌ఓ రామకృష్ణ, సెక్షన్ ఆఫీసర్ రవిశంకర్‌నాగ్, ఎన్‌ఎస్‌టీఆర్ బృందాల సారధ్యంలో అటవీ శాఖ సిబ్బంది గాలిస్తున్నారు.
చదవండి: 20 పులులను చంపిన చిట్టిరాజు.. అసలు ఆ కథేమిటంటే..?
నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు (ఎన్‌ఎస్‌టీఆర్) బృందాలను పులిని ట్రాప్ చేసేందుకు రంగంలోకి దింపారు. పులి సంచరిస్తున్న పరిసర ప్రాంతాలు, ట్రాప్ కెమెరాల్లో చిత్రాలను అధికారుల బృందం క్షుణంగా పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో ఏకకాలంలో ఎనిమిది బోనులను ఆదివారం రాత్రి ఏర్పాటు చేశారు. పులి వ్యవహరిస్తున్న తీరును బట్టి ఎన్ని బోనులు ఏర్పాటు చేసినా చిక్కే పరిస్థితి కనిపించడం లేదు. లేకుంటే ఆఖరి ప్రయత్నంగా ట్రాంక్విలైజర్ గన్‌తో పులికి మత్తు మందు ఇచ్చి బంధించే అవకాశం ఉంది.
బోనులు ఏర్పాటు చేస్తున్న అధికారులు
ఆచితూచి అడుగులు
ట్రాంక్విలైజర్ గన్‌తో ఇచ్చే మత్తు మందు మోతాదు అటు, ఇటు అయితే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. మోతాదు ఎక్కువైతే చనిపోయే ప్రమాదం ఉంది. అదే తక్కువైతే ప్రశాంతంగా ఉన్న పులిని రెచ్చగొట్టినట్లు అవుతుంది. ఆ సమయంతో పులి క్రూరంగా తయారై ప్రజలకు హాని కలిగించే పరిస్థితి ఉంది. అందుకే అధికారులు పులిని బంధించే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అధికారుల ఆలోచనలను చిత్తు చేస్తూ బోనులకు చిక్కకుండా అది దర్జాగా తప్పించుకొంటూ తిరుగుతోంది.
అటుగా వెళ్లనీయకుండా..
పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని పూర్తిగా అధికారులు తమ అ«దీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలోకి పశువులు, జనాలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. తద్వారా పులికి ప్రశాంత వాతావరణాన్ని కల్పించి అటవీ ప్రాంతం వైపు తరలించే దిశగా చర్యలు చేపడుతూనే బోనులను ఏర్పాటు చేశారు. ఇందులో ఏది జరిగినా పులి గండం నుంచి గట్టెక్కినట్టే అవుతుంది. గత 15 రోజులు ప్రజలు సహకరించారని, మరికొద్ది రోజులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పులిని తరలించేందు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఒమ్మంగి, పొదురుపాక, పోతులూరు, ఉత్తరకంచి, పాండవులపాలెం ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment