సాక్షి, అమరావతి: ఏపీ సర్వే శిక్షణ అకాడమీ తిరుపతిలో ఏర్పాటు కానుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లా తిరుపతి మండలం చెన్నయ్యగుంట గ్రామ పరిధిలో 41.19 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రస్తుతం ఈ అకాడమీ తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో తాత్కాలికంగా కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇది హైదరాబాద్ గచ్చిబౌలిలోని 200 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఉండేది.
రాష్ట్ర విభజన తర్వాత అది తెలంగాణ ఆధీనంలోకి వెళ్లింది. రాష్ట్రంలో సర్వే శిక్షణ అవసరాల కోసం అకాడమీ లేకపోవడంతో 2017లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని పంచాయతీరాజ్ ఎక్స్‌టెన్షన్ ట్రెయినింగ్ సెంటర్‌లో లీజు ప్రాతిపదికన సర్వే అకాడమీని ఏర్పాటు చేశారు. అది కేవలం 2.90 ఎకరాల్లో మాత్రమే ఉంది. తాత్కాలిక కేంద్రంలో సరిపడా వసతులు లేకుండానే అకాడమీ నడుస్తున్న విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ వెంటనే శాశ్వత అకాడమీకి తిరుపతిలో భూమి కేటాయించారు. ఈ భూముల్లో త్వరలో కొత్త అకాడమీని ఏర్పాటుచేసేందుకు సర్వే శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. తరగతి గదులు, హాస్టల్, పరిపాలనా భవనం, క్యాంటీన్ ఇతర సౌకర్యాల కోసం భవనాలను నిర్మించాల్సి వుంది.
అందరికీ ఇక్కడే శిక్షణ
కొత్తగా సర్వీసులోకి వచ్చిన ఐఏఎస్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లకు భూముల సర్వేపై ఇక్కడే శిక్షణనిస్తారు. ప్రొబేషనరీ డిప్యూటీ తహశీల్దార్లు, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్లు, జ్యుడీషియల్ అధికారులు, ఇతర సర్వే ఉద్యోగులకూ సర్వేపై శిక్షణ ఇస్తారు. కొత్తగా సర్వీసులోకి వచ్చిన వారికి ఇండక్షన్ ట్రెయినింగ్‌లు, ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులకు రిఫ్రెషర్ ట్రెయినింగ్‌లు, కొన్ని ప్రత్యేక శిక్షణలతోపాటు అడ్వాన్స్‌డ్ సర్వే టెక్నాలజీ ట్రెయినింగ్‌లనూ ఇక్కడ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బందికి పెద్దఎత్తున శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అకాడమీకి ముఖ్యమంత్రి తిరుపతిలో భూములు కేటాయించినట్లు సర్వే శాఖ అధికారులు తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత 11,187 మంది సర్వేయర్లకు అకాడమీ 50కిపైగా శిక్షణలు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment