తిరుపతిలో ప్రజలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
3 Capitals Of Andhra Pradesh: ఇప్పుడు జిల్లాలో ఎక్కడ చూసినా అభివృద్ధి వికేంద్రీకరణపైనే చర్చ సాగుతోంది. మూడు రాజధానులకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. సభలు, సమావేశాల రూపంలో సీమ సమాజం చైతన్యవంతమవుతోంది. కర్నూలును న్యాయ రాజధానిగా తీర్చిదిద్దాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. గతంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలనే ఆకాంక్ష ఆకాశాన్నంటుతోంది. ఎవరితో గొడవలొద్దని.. రాయలసీమ అభివృద్ధే తమ మంత్రమని ప్రజానీకం విన్నవిస్తోంది.
తిరుపతి తుడా/యూనివర్సిటీ క్యాంపస్: రాయలసీమ అభివృద్ధికి వ్యతిరేకంగా అమరావతి రైతుల పేరుతో చేపట్టిన యాత్ర జిల్లావ్యాప్తంగా చర్చకు తెరతీసింది. సీమ ప్రజల మనోభావాలు దెబ్బతీసేందుకే ఇక్కడ యాత్ర చేస్తున్నారా? అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును అడ్డుకుంటూ ఇక్కడే యాత్ర చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. రెండు రోజులుగా టీ అంగళ్లు, పార్కులు, వాకింగ్ ప్రదేశాలు ఇలా నలుగురు చేరితే ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
దీనికితోడు అలిపిరికి వెళ్లాల్సిన యాత్రను తిరుపతి నగరంలోని అనేక వీధుల్లో తిరిగేలా రూట్‌మ్యాప్ చేయడంపై నగరవాసులు భగ్గుమంటున్నారు. ఇది ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకే చంద్రబాబు ఇలాంటి డ్రామాలు చేయిస్తున్నారని విమర్శిస్తున్నారు. అమరావతి రైతుల పేరుతో సాగుతున్న యాత్ర వెనుక కుట్రకోణం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ గడ్డపై పుట్టిన చంద్రబాబు సీమకు వ్యతిరేకంగా యాత్ర చేయించడం సిగ్గుచేటని మండిపడుతున్నారు.
సీమ ప్రయోజనాలే లక్ష్యంగా..
మూడు రాజధానులకు మద్దతుగా, సీమ ప్రయోజనాలే లక్ష్యంగా మేధావులు, విద్యార్థులు నడుం బిగించారు. దీనిపై కొన్ని రోజులుగా సంఘీభావ సభలు నిర్వహిస్తున్నారు. పాదయాత్రకు మద్దతిస్తున్న వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కర్నూలులోని రాజధానిని త్యాగం చేశామని గుర్తు చేస్తున్నారు. న్యాయ రాజధానిని ఇప్పుడు సాధించకపోతే ఇక ఎప్పటికీ వెనకబడి ఉండాల్సిందే అని హెచ్చరిస్తున్నారు. ఈనెల 17వ తేదీన సీమ ప్రయోజనాల పరిరక్షణకు తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.
కనువిప్పు కలిగేలా..!
రైతుల పేరుతో సాగుతున్న పాదయాత్ర మంగళవారం తిరుపతిలోని పలు వీధులను చుట్టనుంది. ప్రజలు తమ విన్నపాలను సున్నితంగా తెలియజేసేందుకు స్వచ్ఛందంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. యాత్రలోని ప్రతి ఒక్కరికీ కనువిప్పు కలిగేలా నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్డులు పెట్టారు. రాయలసీమ అభివృద్ధి మీకు ఇష్టం లేదా? హైకోర్టు రావడం మీకు ఎందుకు ఇష్టం లేదో చెప్పండి? మాతో మీకు ఎలాంటి గొడవలు వద్దు? మా విన్నపాలను గౌరవించండి? మాకు రావాల్సిన హక్కులను అడ్డుకోకండి? అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు.
మూడు రాజధానులతోనే అభివృద్ధి
గంగాధరనెల్లూరు : మూడు రాజధానులతోనే రాష్ట్రాభివద్ధి సాధ్యమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ విధ్వే షాలు రెచ్చగొట్టి లబ్ధిపొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజధాని రైతుల పేరుతో దొంగ యాత్రలు చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు సీమ ప్రజలే తగిన బుద్ధిచెబుతారని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణే ప్రజల అభిమతమని తెలిపారు. ఆర్టీసీ ఉపాధ్యక్షుడు ఎంసీ విజయానందరెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానులతో యువతకు ఉపాధి ఆవకాశాలు పెరుగుతాయన్నారు.
రాయలసీమ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకోవడం బాధాకరం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే మీకేంటి నష్టం?. రైతుల పేరుతో సాగుతున్న ఈ కార్పొరేట్ యాత్రకు దర్శక నిర్మాత చంద్రబాబే. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక కులానికి లబ్ది చేకూర్చేలా వ్యవహరించారు. ఇప్పుడు ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారు.
– కల్లూరి చెంగయ్య, ఐక్యదళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు
అమరావతి రైతుల పేరుతో చిత్తూరు జిల్లాలో యాత్ర చేయడమంటే ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే. చంద్రబాబు ఆది నుంచి సీమ వ్యతిరేకి. ఆయన కారణంగానే రాయలసీమ నీటి కేటాయింపులు, వివిధ ప్రాజెక్ట్‌లను కోల్పోయింది. రాజధానిని అమరావతికి తీసుకెళ్లి మరోసారి ద్రోహం చేశారు.
– పురుషోత్తం రెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్
రాయలసీమలో పుట్టి ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా సాగుతున్న యాత్రకు అనుకూలంగా వ్యవహరిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. చంద్రబాబు చేయిస్తున్న దొంగయాత్రను ప్రజ లు నమ్మరు. వెనుకబడిన ప్రాంతాలకు అన్యాయం చేసేందుకు యాత్ర చేయ డం సిగ్గుచేటు. బినామీలు, ఆర్థిక ఉగ్రవాదుల కోసమే చంద్రబాబు అమరావతిని రాజధాని చేయాలనుకుంటున్నారు.
– వడిత్యా శంకర్‌నాయక్, గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment