ఐటీలో నియామకాల జోష్‌.. | Top Four Indian IT Companies To Hire Over One Lakh Employees This Year | Sakshi
Sakshi News home page

ఐటీలో నియామకాల జోష్‌..

Published Fri, May 28 2021 8:50 AM | Last Updated on Fri, May 28 2021 8:50 AM

Top Four Indian IT Companies To Hire Over One Lakh Employees This Year - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఉద్యోగ నియామకాల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగం తన జోరు చూపిస్తోంది. దేశంలో టాప్‌–4 ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌ ఈ ఏడాది లక్ష మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ఇప్పటికే ప్రకటించడం ఇందుకు నిదర్శనం. దీంతో ఐటీ పట్టభద్రులకు ఒక్కసారిగా భారీ డిమాండ్‌ ఏర్పడింది. విద్యార్థులకు ఒకేసారి మూడు నాలుగు ఆఫర్లు వస్తుండటంతో కావాల్సినంత జీతం అడిగే అవకాశం లభిస్తోంది. గతేడాది టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు 72,000 మందికి ఉద్యోగాలిచ్చాయి.

తాజాగా చదువు పూర్తి చేసుకున్నవారిలో.. 2020లో 6 శాతం మందికి ఉద్యోగాలు దక్కితే ఇప్పుడది 15 శాతానికి పెరిగినట్టు ఇండియన్‌ స్టాఫింగ్‌ ఫెడరేషన్‌ (ఐఎస్‌ఎఫ్‌) పేర్కొంది. కోవిడ్‌–19 అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపితే ఐటీ రంగానికి మాత్రం భారీ ప్రయోజనం దక్కింది. లాక్‌డౌన్‌తో చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలోకి మారుతుండటంతో దీనికనుగుణంగా ఐటీ అప్‌గ్రేడేషన్, డిజిటల్‌ సేవలను పెంచుకోవడంపై దృష్టిసారించాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా కంపెనీలు డిజిటలైజేషన్, ఆటోమేషన్‌ వైపు మారుతుండటంతో ఐటీ రంగంలో ఒక్కసారిగా ఉద్యోగ నియామకాలకు డిమాండ్‌ పెరిగిందని ఐఎస్‌ఎఫ్‌ తెలిపింది.

ఈ కోర్సులు చేస్తే..
కోవిడ్‌ తర్వాత ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, బ్లాక్‌ చైన్, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, బిగ్‌ డేటా, ఆటోమేషన్‌ వంటి విభాగాల్లో ఉద్యోగావకాశాలు పెరిగాయి. వచ్చే మూడేళ్లలో ఐటీ రంగంలో 65 నుంచి 70 లక్షల మంది ఉద్యోగులు అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ దానికి తగ్గట్టుగా మానవవనరులు అందుబాటులో లేకపోవడంతో ఐటీ కంపెనీలు సతమతమవుతున్నాయి. దీంతో ఈ కోర్సుల్లో నైపుణ్యం కలిగిన వారు గతంలో కంటే 50 నుంచి 70 శాతం అధిక జీతం డిమాండ్‌ చేస్తున్నారని ఏబీసీ కన్సల్టింగ్‌ సీనియర్‌ డైరెక్టర్‌ రతన్‌ గుప్తా వివరించారు.

ఈ కోర్సులు చేసిన ప్రతి పది మందిలో నలుగురైదుగురు జాబ్‌ ఆఫర్లను తిరస్కరిస్తున్నారని చెప్పారు. చేతిలో మూడు నాలుగు ఆఫర్లు ఉంటుండటంతో.. నచ్చిన జీతం ఇచ్చిన కంపెనీని ఎంచుకోవడమే ఇందుకు కారణమన్నారు. సాధారణ ఇంజనీరింగ్‌ కోర్సు చేసిన వారికి ఐటీ కంపెనీల్లో ప్రారంభ వార్షిక వేతనం రూ.3 –రూ.3.5 లక్షలు ఇస్తున్నారని, అదే ప్రస్తుతం డిమాండ్‌ ఉన్న టెక్నాలజీ కోర్సులు నేర్చుకుంటే ప్రారంభ వేతనమే రూ.6– రూ.8 లక్షలు వస్తోందని నెక్టŠస్‌ వేవ్‌ సంస్థ హెచ్‌ఆర్‌ హెడ్‌ గిరీష్‌ ఆకాష్‌ యశ్వంత్‌ తెలిపారు. ఇంజనీరింగ్‌ చదువుతూ ఈ టెక్నాలజీలపై పట్టు సాధిస్తే కోర్సు పూర్తికాగానే అందరికీ ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

కంపెనీలకు కత్తి మీద సాము
బయట భారీ డిమాండ్‌ ఉండటంతో నైపుణ్యం కలిగిన వారిని కాపాడుకోవడం ఇప్పుడు కంపెనీలకు కత్తి మీద సాముగా మారింది. కొత్త టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న వారిని కంపెనీలు మంచి జీతం ఇచ్చి తీసుకుంటుండంతో ఉద్యోగులు కంపెనీ మారిపోతున్నారు. మొన్న ఆర్థిక ఫలితాల సందర్భంగా ఐటీ కంపెనీలు ప్రకటించిన అట్రిషన్‌ (ఉద్యోగులు మానేయడం) రేటే దీనికి నిదర్శనం.

ఒక్క టీసీఎస్‌ తప్ప మిగిలిన కంపెనీల్లో అట్రిషన్‌ రేటు భారీగా పెరిగిపోయింది. పైగా ఈ ఏడాది ఈ రేటు ఇంకా పెరిగే అవకాశాలుంటాయన్న సంకేతాలను ఇచ్చాయి. నాలుగో త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌లో అట్రిషన్‌ రేటు 15 శాతానికి పెరగ్గా.. వచ్చే రెండు త్రైమాసికాలు కూడా ఇదే విధంగా కొనసాగే ప్రమాదం ఉంది. విప్రోలో 12.1 శాతంగా ఉన్న అట్రిషన్‌ రేటు ఈ ఏడాది మరింత పెరగొచ్చు. టీసీఎస్‌లో మాత్రం అట్రిషన్‌ రేటు జీవితకాల కనిష్ట స్థాయి 7.2 శాతానికి చేరుకోవడం గమనార్హం. మొత్తం మీద దేశీయ ఐటీ కంపెనీల్లో 2020–21లో అట్రిషన్‌ రేటు 10–12 శాతంగా ఉండగా, అది ఈ ఏడాది 20–25 శాతానికి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే.. మంచి ఆఫర్‌తో అవకాశం వస్తే గోడ దూకేయడానికి ఇండియన్‌ టెకీలు సిద్ధంగా ఉన్నారన్నమాట.

చదవండి: Andhra Pradesh: బలంగా బడి పునాదులు  
ఓటుకు కోట్లు కేసులో  కర్త, కర్మ, క్రియ చంద్రబాబే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement