ఉద్యోగాలు.. ఉద్వేగాలు | Revealed in Gallup State of the Global Workforce 2024 report | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు.. ఉద్వేగాలు

Published Thu, Sep 19 2024 4:02 AM | Last Updated on Thu, Sep 19 2024 4:02 AM

Revealed in Gallup State of the Global Workforce 2024 report

భారత్‌లో 86 శాతం ఉద్యోగులు ఇలా ఇబ్బందిపడుతున్నవారే

భావోద్వేగాలపరంగా ప్రతీరోజు కోపం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారు 35 శాతం మంది

గ్యాలప్‌ స్టేట్‌ ఆఫ్‌ ద గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌– 2024 నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: భారతీయ ఉద్యోగులు తమ పని ప్రదేశాలు, రోజువారీ జీవనాన్ని గడిపే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగుల్లో అత్యధికులు తమ జీవితం సాగుతున్న తీరు పట్ల అంత సంతోషంగా లేరని తెలుస్తోంది. దక్షిణాసియాలోనే రెండో అతి పెద్దసంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్న దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది. మనదేశంలోని ఉద్యోగుల స్థితిగతులు, ఇతర అంశాల గురించి లోతుగా పరిశీలించినప్పుడు.. వారి ఉద్యోగ జీవితం మానసికంగా, భావోద్వేగాలపరంగా, సామాజిక అంశాలపరంగా అంతగా సంతోషంగా, సంతృప్తికరంగా సాగడం లేదని స్పష్టమవుతోంది. 

దేశంలోని 86 శాతం మంది ఉద్యోగులు ఇబ్బందులు లేదా కష్టాల్లో (స్ట్రగులింగ్‌ ఆర్‌ సఫరింగ్‌) సాగుతున్నట్టుగా గ్యాలప్‌ స్టేట్‌ ఆఫ్‌ ద గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌–2024 వార్షిక నివేదిక తెలిపింది. మొత్తం ఉద్యోగుల్లో 14 శాతం మంది మాత్రమే తాము అన్నివిధాలుగా పురోగతి సాధిస్తూ సంతృప్తిగా, పూర్తి ఆశావహ దృక్పథంతో ముందుకు అడుగువేస్తున్నట్టుగా ఈ అధ్యయనం తెలియజేసింది. 

దక్షిణాసియాలోనే రెండో పెద్ద వర్క్‌ఫోర్స్‌గా ఉన్న మన దేశంలోని ఉద్యోగుల పరిస్థితులపై రూపొందించిన ఈ నివేదికలో భాగంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల మానసికస్థితి, వారి శ్రేయస్సు, అభ్యున్నతి ఎలా ఉందనే అంశంపై ఈ సంస్థ అంచనా వేసింది. ప్రధానంగా గ్యాలప్‌ కేటగిరీల వారీగా జీవన మూల్యాంకన సూచీ (లైఫ్‌ ఎవల్యువేషన్‌ ఇండెక్స్‌)..సంతృప్తి–పురోగతి (త్రైవింగ్‌), కష్టాలు ఎదుర్కోవడం (స్ట్రగులింగ్‌), బాధ–కుంగుబాటు (సఫరింగ్‌) మూడు గ్రూపులుగా ఉద్యోగులను వర్గీకరించింది. 
 
పరిశీలన ఇలా... 
ఉద్యోగులు తాము సాగిస్తున్న జీవనం, భవిష్యత్‌ ఆలోచనల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారా లేదా ? ప్రస్తుతం తామున్న పరిస్థితిపై సంతృప్తి, ఆశావహ దృక్పథం, ఇతర ధోరణులకు అనుగుణంగా పది పాయింట్లకు గాను ఏడు ఆపై స్థాయి లో పాయింట్లు సాధించే వారిని ‘త్రైవింగ్‌’ (సంతృప్తితో) కేటగిరీలోని వారిగా ఈ సంస్థ లెక్కించింది. 

ఉద్యోగులు గడుపుతున్న జీవితం పట్ల అభద్రతాభావంతో అగమ్యగోచరంగా లేదా ప్రతికూలతతో ఉన్న వారిని, రోజువారీ ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని ‘స్ట్రగులింగ్‌’గా పరిగణించింది. ఇక ‘సఫరింగ్‌’గ్రూపులో ఉన్న వారిని...వ్యక్తులుగా వారు ప్రస్తుత జీవనం, భవిష్యత్‌ అనేవి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా భావిస్తున్న వారిగా, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక, శారీరకంగా, భావోద్వేగపరంగా బాధ అనుభవిస్తున్న వారిగా వర్గీకరించింది.  

‘స్టేట్‌ ఆఫ్‌ ద గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌’నివేదికలో ఇంకా ఏముందంటే..
» ప్రతీరోజు భావోద్వేగపరంగా ఎదురవుతున్న అనుభవాలు, మనస్థితిని బట్టి 35 శాతం మంది భారతీయులు రోజూ కోపం, ఆగ్రహానికి లోనవుతున్నారు. ఇది దక్షిణాసియాలోనే అత్యధికం. 
» భారత్‌లో రోజువారీ ఒత్తిళ్లు అనేవి అత్యల్పంగా ఉన్నట్టు తేలింది. దక్షిణాసియా ప్రాంతంలో చూస్తే..శ్రీలంకలో ఇది 62 శాతంగా, అఫ్గానిస్తాన్‌లో 58 శాతంగా, భారత్‌లో 32 శాతంగా ఉంది. 
» దక్షిణాసియాలో..గడిచిన ముందు రోజు పట్ల ఒంటరితనం (29 శాతం), ఆగ్రహం, కోపం (34 శాతం), విచారం (42 శాతం) బారిన ఉద్యోగులు పడినట్టు స్పష్టమైంది. 
» దక్షిణాసియాలో 48 శాతం మంది ప్రస్తుత సమయంలో ఉద్యోగాలు పొందడానికి సరైనదనే భావనలో ఉన్నారు 
» అదే భారత్‌ విషయానికొస్తే...57 శాతం మంది అదే అభిప్రాయంతో ఉన్నారు. 
» ప్రాంతీయంగా చూస్తే...తాము ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగాలు విడిచిపెట్టి కొత్త వాటిని కోరుకుంటున్నవారు 58 శాతం కాగా,.. భారత్‌లో మాత్రం 52 శాతంగా ఉన్నారు .

గ్యాలప్‌ స్టేట్‌ ఆఫ్‌ ద గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌ అంటే... 
ప్రపంచవ్యాప్తంగా 80 ఏళ్లుగా వివిధ కంపెనీలు, సంస్థలు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలపై అధ్యయనం చేసి, అవసరమైన విశ్లేషణలు అందిస్తూ ఆయా సమస్యలను అధిగమించేందుకు ‘గ్యాలప్‌’సంస్థ కృషి చేస్తోంది. 

ఉద్యోగులు, వినియోగదారులు, విద్యార్థులు, పౌరుల వైఖరులు, వారి ప్రవర్తన తీరుతెన్నులపై ఈ సంస్థ పూర్తి అవగాహన కలిగి ఉండడంతో, ఈ వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను సరిగ్గా ఎత్తిచూపగలుగుతోంది. వారి మనస్థితి, సంతృప్తి, ఇబ్బందులు, విచారం వంటి వాటిని అంచనా వేయగలుగుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement