
సాక్షి, తిరుమల: కానిస్టేబుల్ షేక్ అర్షద్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా అర్షద్‌కు అభినందనలు తెలిపారు. ‘60 ఏళ్ల మహిళను ఆరు కిలోమీటర్ల దూరం అడవి గుండా తిరుమలకు మోసుకొచ్చావు. భక్తురాలికి నీవు చేసిన సేవ అభినందనీయం. నీ సేవలను గుర్తించాలని డీజీపీకి చెబుతాను' అని కడప స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌ను అభినందించారు. రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి ఆకేపాడు నుంచి తిరుమలకు అన్నమయ్య మార్గంలో ఇటీవల మహా పాదయాత్ర జరిపిన విషయం తెలిసిందే. (చదవండి: శ్రీవారి భక్తురాలికి తనే వాహనమయ్యాడు)
ఆ పాదయాత్రలో పాల్గొన్న నందలూరుకు చెందిన 60 ఏళ్ల నాగేశ్వరమ్మ ఈ నెల 23వ తేదీ అటవీప్రాంతంలో అస్వస్థతకు గురై సొమ్మసిల్లిపోయారు. పాదయాత్ర భద్రత డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ అర్షద్.. ఆమెను తన భుజాల మీద వేసుకుని తిరుమలకు మోసుకొచ్చి అశ్విని ఆసుపత్రిలో చేర్పించాడు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా వెలువడింది. టీటీడీ చైర్మన్ ... కానిస్టేబుల్ వివరాలు, సెల్ నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి అభినందించారు. మీ లాంటి వారి సేవలు ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని చెప్పారు. వేంకటేశ్వర స్వామి ఇచ్చిన శక్తితోనే ఆ భక్తురాలిని ఆరు కిలోమీటర్ల మేర మోసుకెళ్లానని కానిస్టేబుల్ అర్షద్ చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment