టీటీడీ అగరబత్తీలను విడుదల చేస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన, ఈవో జవహర్‌రెడ్డి తదితరులు
తిరుపతి రూరల్/కల్చరల్/చంద్రగిరి (చిత్తూరు జిల్లా)/తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో తయారు చేసిన పరిమళ అగరబత్తీలు భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలోని 50 దేవాలయాల్లో స్వామి, అమ్మవార్ల పూజల్లో ఉపయోగించిన పూలతో ఈ అగరబత్తీలను తయారు చేస్తున్నామన్నారు. సోమవారం తిరుపతి ఎస్వీ గోశాలలోని అగరబత్తీల తయారీ కేంద్రాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఈవో జవహర్‌రెడ్డి, ఏఈవో పాల్గొన్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఎలాంటి లాభాపేక్ష లేకుండా దర్శన్ సంస్థ వీటిని తయారు చేస్తోందన్నారు. ‘ఏడు రకాల అగరబత్తీలను భక్తులకు అందుబాటులోకి తెచ్చాం. కెమికల్స్ లేకుండా పరిమళభరితంగా తయారు చేస్తున్నారు. వాడిన పూలతో బొమ్మల తయారీని ప్రారంభించాం. సప్తగిరి మాసపత్రికను తిరిగి అందుబాటులోకి తెచ్చాం. రంగుల పేజీలతో శ్రీవారి సమాచారాన్ని అందిస్తున్నాం’ అని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకష్టి, స్పష్టి, తుష్టి, దష్టి పేర్లతో అగరబత్తీలను మార్కెట్లోకి విడుదల చేశామన్నారు.
తిరుమలలో అగరబత్తీల అమ్మకాలు
టీటీడీ తయారు చేసిన అగరబత్తీలు సోమవారం నుంచి తిరుమలలో భక్తులకు విక్రయిస్తున్నారు. లడ్డూ కౌంటర్ల వద్ద 3 కౌంటర్లు, శ్రీవారి ఆలయం ఎదురుగా పుస్తకాల విక్రయాల వద్ద ఓ కౌంటర్‌ను టీటీడీ ప్రారంభించింది. మొదటి రోజు అగరబత్తీలను భక్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు.
శ్రీనివాసమంగాపురంలో మినీ కల్యాణ కట్ట
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సోమవారం మినీ కల్యాణ కట్టను ఆలయ అధికారులు ఓ భక్తురాలితో ప్రారంభింపజేశారు. ఆలయానికి వచ్చే భక్తులు, శ్రీవారిమెట్టు మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించేందుకు అనువుగా ఉంటుందని ఆలయ డిప్యూటీ ఈవో శాంతి తెలిపారు.
వచ్చే ఏడాదికి బంగారు తాపడం పనులు పూర్తి
టీటీడీ అనుబంధంగా తిరుపతిలో ఉన్న శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయంలో విమాన గోపురానికి రాగి రేకులపై బంగారు తాపడం పనులు వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయంలో ఈనెల 9 నుంచి చేపట్టిన గోవిందుని బాలాలయ సంప్రోక్షణ సోమవారం ముగిసింది. కార్యక్రమానికి హాజరైన టీటీడీ చైర్మన్ మాట్లాడారు. తర్వాత అధికారులతో కలిసి ఆలయంలోని విమాన గోపురం, ఐనా మహల్ వంటి వాటిని పరిశీలించారు.
త్వరలోనే సర్వ దర్శనం టోకెన్ల సంఖ్య పెంపు: టీటీడీ చైర్మన్
పేదలకు శ్రీవారి దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతో నాలుగు రోజుల కిందట నుంచి రోజుకు రెండు వేల సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రారంభించినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు ఈ సదుపాయం కల్పించామన్నారు. టోకెన్లు పొందేందుకు కౌంటర్ల వద్దకు వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. త్వరలోనే సర్వ దర్శనం టోకెన్ల సంఖ్య పెంచే అంశంపై అధికారులతో చర్చించనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment