
సాక్షి, తిరుమల: తిరుమలలో బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. భక్తులు వాహనసేవ వీక్షించడానికి మాడవీధులను పరిశీలించినట్టు చెప్పారు.
కాగా, ఈవో ధర్మారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 18వ తేదీన రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గరుడోత్సవం రోజు దగ్గరంగా వాహనసేవను వీక్షించడానికి మాడవీధులను పరిశీలించామన్నారు. గ్యాలరీలలో 2 లక్షల మంది భక్తులు వాహనసేవలు వీక్షిస్తారు. అందరూ వాహనసేవలు వీక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు.
మరోవైపు.. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల నిమిత్తం అదనంగా మరో 100 ఎకరాల భూమి కేటాయింపుపై మంత్రి రోజాతో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చర్చించారు. పాధిరేడు అరణ్యం వద్ద గతంలో 300 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రమంలో నగరిలోని తన నివాసం వద్ద భూమనను మంత్రి రోజా సత్కరించారు.
ఇది కూడా చదవండి: ఏపీకి వర్షసూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్