AP: అనిశ్చితి నుంచి నిశ్చింతగా!.. జీపీఎస్‌తో పూర్తి గ్యారెంటీ | Two DRs per year in GPS based on inflation | Sakshi
Sakshi News home page

AP: అనిశ్చితి నుంచి నిశ్చింతగా!.. జీపీఎస్‌తో పూర్తి గ్యారెంటీ

Published Sun, Jun 11 2023 4:55 AM | Last Updated on Sun, Jun 11 2023 8:49 AM

Two DRs per year in GPS based on inflation - Sakshi

సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధికారంలో ఉండగా 2003లో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)కు బీజం పడింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు సీపీఎస్‌ రద్దు గురించి వినడానికి కూడా ఇష్టపడలేదు.

సీపీఎస్‌ ఉద్యోగులకు మేలు చేస్తామని గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌ ప్రకటించడంతో చంద్రబాబు హడావుడిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ టక్కర్‌ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సీపీఎస్‌ ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేస్తుంటే తప్పుడు కథనాలతో ఈనాడు రామోజీ బురద చల్లుతున్నారు.  

రాష్ట్రం, ఉద్యోగాల ప్రయోజనాలను కాపాడుతూ.. 
సీపీఎస్‌ విధానంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల చివరి నెల బేసిక్‌లో 20 శాతం కూడా పెన్షన్‌ కింద వస్తుందని గ్యారెంటీ లేదు. అదే జీపీఎస్‌ విధానం ప్రకారం రిటైర్డ్‌ ఉద్యోగుల చివరి నెల బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా అందుతుందని గ్యారెంటీ కల్పిస్తుంటే రామోజీకి రుచించడంలేదు. ఉద్యోగులకు మంచి చేస్తుంటే భరించలేకపోతున్నారు. ఓపీఎస్‌ అమలు చేయడం వల్ల భవిష్యత్‌ తరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

పెన్షన్‌ భారం ఉద్యోగుల జీతాలను సైతం దాటేసి మోయలేని స్థాయికి చేరుతుంది. రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. ఏదో ఒక దశలో ఈ మోయలేని భారాన్ని తట్టుకోలేక 2003 తరహాలోనే రద్దు చేసి ప్రత్యామ్నాయం తేవాల్సి వస్తుంది. ఇవన్నీ అధ్యయనం చేసిన తరువాతే సీపీఎస్‌ కన్నా మెరుగ్గా జీపీఎస్‌ను రూపొందించారు. ఇటు రాష్ట్ర భవిష్యత్తుతో పాటు అటు ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని వెనుక రెండున్నరేళ్ల పాటు కసరత్తు చేసింది.

మంత్రుల కమిటీని నియమించి అధ్య­యనం చేసింది. సీఎస్‌ అధ్యక్షతన వర్కింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. చార్టర్డ్‌ అకౌంటెంట్‌ నిపుణులతో అధ్యయనం జరిపింది. ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో వారి యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని సమతూకం పాటిస్తూ జీపీఎస్‌ను తెచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో తిరిగి ఓపీఎస్‌ తెస్తున్నట్లు పేర్కొన్నా అమలులోకి రాకపోవడం గమనార్హం.  

సీపీఎస్‌లో అనిశ్చితి 
సీపీఎస్‌ విధానం 01–09–2004 తర్వాత చేరిన ఉద్యోగులకు వర్తిస్తుంది.  
♦ సీపీఎస్‌ విధానంలో పెన్షన్‌ ఎంత వస్తుందనేది గ్యారెంటీ లేదు. 
♦ రిటైరైన ఉద్యోగి చివరి నెల బేసిక్‌ వేతనం రూ.లక్ష అయితే పెన్షన్‌ సుమారు రూ.20 వేలు మాత్రమే వస్తుంది. ఇది కూడా వడ్డీరేట్లపై ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేటు తగ్గితే పెన్షన్‌ కూడా తగ్గుతుంది. 
♦ వడ్డీ రేట్లు ఇంకా తగ్గిపోతే 20 శాతం పెన్షన్‌ కూడా వస్తుందా రాదో అనే అనిశ్చితి. ఇదంతా మార్కెట్‌తో లింక్‌ అయి ఉంటుంది. మారుతున్న వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. దశాబ్దం కాలంగా వడ్డీ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. 
♦ ద్రవ్యోల్బణం వల్ల కాలం గడిచేకొద్దీ పెరిగే జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి డీఆర్‌లు ఇందులో ఇవ్వడం లేదు. 
 62 ఏళ్లకు ఉద్యోగి రిటైరైతే మరో 20 ఏళ్ల తరువాత పెన్షన్‌ విషయంలో ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకోలేదు. 
♦ ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్‌లో 10 శాతం జీతాన్ని పెన్షన్‌ ఫండ్‌కు బదిలీ చేయాలి. అంతే మొత్తాన్ని ప్రభుత్వం ఇస్తుంది. 
♦ సీపీఎస్‌ పెన్షన్‌లో పూర్తి అనిశ్చితి ఉంటుంది. మార్కెట్‌లో పరిస్థితుల ప్రకారం హెచ్చు తగ్గులుంటాయి.  
♦ పెన్షన్‌కు గ్యారెంటీ, భద్రత లేదు 
♦ పదవీ విరమణ తరువాత ఉద్యోగికి ద్రవ్యోల్బణం నుంచి రక్షణ లేదు.  

జీపీఎస్‌తో పూర్తి గ్యారెంటీ
♦ 
జీపీఎస్‌ విధానంలో పెన్షన్‌కు పూర్తి గ్యారెంటీ ఉంటుంది. పెన్షన్‌ ఎంత వస్తుందో ఉద్యోగికి ముందుగానే తెలుస్తుంది. 
♦ సీపీఎస్‌ తరహాలోనే ఉద్యోగి 10 శాతం చెల్లిస్తే ప్రభుత్వం దానికి సమానంగా అందచేస్తుంది. 
♦ మార్కెట్‌ స్థితి గతులతో, వడ్డీ రేట్లతో ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి అనిశ్చితికి తావేలేదు. పెన్షన్‌ విషయంలో పూర్తి భరోసా. 
♦ రిటైర్‌మెంట్‌ చివరి నెల వేతనం బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా కచ్చితంగా అందుతుంది. సీపీఎస్‌తో పోలిస్తే జీపీఎస్‌లో అందే పెన్షన్‌ 150 శాతం అధికంగా ఉంటుంది. ♦  ద్రవ్యోల్బణాన్ని, పెరిగే ధరలను దృష్టిలో  ఉంచు­కుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్నెల్లకు ఒకసారి ప్రకటించే డీఏలను పరిగణలోకి తీసుకుని ఏడాదికి రెండు డీఆర్‌లు ఇస్తారు. దీని వల్ల పెన్షన్‌ ఏటా పెరుగుతూ పోతుంది. 
♦ రిటైరైన ఉద్యోగి చివరి నెల బేసిక్‌ జీతం రూ.లక్ష ఉంటే రూ.50 వేలు పెన్షన్‌గా వస్తుంది. ఏడాదికి రెండు డీఆర్‌లతో కలుపుకొని ఇది పెరుగుతూ పోతుంది. 
♦ 62 ఏళ్లకు రిటైరైన ఉద్యోగికి 82 ఏళ్లు వచ్చేసరికి జీపీఎస్‌ ద్వారా పెన్షన్‌ రూ.1,10,000కి చేరుతుంది. తద్వారా రిటైరైన ఉద్యోగి జీవన ప్రమాణాలను కాపాడినట్లు అవుతుంది. 
♦  పదవీ విరమణ అనంతరం జీవన విధానాని­కి ఆటంకాలు లేకుండా, సంతోషంగా గడిపే­లా జీపీఎస్‌లో రక్షణ చర్యలు తీసుకున్నారు. సీపీఎస్‌లో ఇలాంటి వెసులు బాటే లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement