కేంద్ర హోంశాఖ కార్యదర్శితో మాట్లాడుతున్న సీఎస్ సమీర్‌శర్మ
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు సామరస్యంగా పరిష్కారమయ్యేలా కేంద్ర ప్రభుత్వం తగిన తోడ్పాటు అందిస్తుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. పెండింగ్ అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సమీర్‌శర్మ, సోమేశ్‌కుమార్‌తో బుధవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇరు రాష్ట్రాల వాదనలను తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.
విద్యుత్తు బకాయిలపై చర్చ..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య చిక్కుముడిగా మారిన 10 ద్వైపాక్షిక అంశాలతో పాటు 8 ప్రాజెక్టులు, అజెండాలోని ఇతర అంశాలను అజయ్ భల్లా సమీక్షించారు. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థలకు సంబంధించిన వివాదాలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, అనుబంధ కంపెనీ ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన, ఢిల్లీలోని ఏపీ భవన్, పన్ను బకాయిలు, రీఫండ్ అంశాలపై సమీక్షించారు. పునర్విభజన చట్టం జాబితాలో లేని సంస్థల విభజన, నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల విభజన, తెలంగాణ డిస్కమ్‌లు ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు తదితర అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చించారు.
రెవెన్యూ లోటు, పోలవరం, కడప స్టీల్ ప్లాంట్..
ఆంధప్రదేశ్‌కు 2014 – 15కి సంబంధించి రెవెన్యూ లోటు నిధులను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సమావేశంలో ప్రస్తావించారు. పోలవరానికి నిధులు, గ్రీన్‌ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు తదితరాలను అజయ్ భల్లా దృష్టికి తెచ్చారు. కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖ, విజయవాడ, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాల ఆవశ్యకతను వివరించారు. దుగ్గరాజుపట్నం ఓడరేవుకు బదులుగా రామాయపట్నం రేవు అభివృద్ధి, విశాఖపట్నం–చైన్నై పారిశ్రామిక నడవా, కేంద్రం నుంచి పన్ను రాయితీ బకాయిల గురించి కూడా ప్రస్తావించారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్, రాష్ట్ర పునర్విభజన విభాగం ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, ఏపీ జెన్‌కో ఎండీ శ్రీధర్, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కేఎస్.జవహర్ రెడ్డి వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment