విశాఖ ప్రాంతానికి చెందిన దంపతులు 30 ఏళ్లు కుటుంబ బాధ్యతల్లో ఎంతో గొప్పగా మెలిగారు. భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాగా.. ఆయన భార్య కొడుకు స్థిరపడ్డాక సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. ఇదే వీరిద్దరి మధ్య మూడు దశాబ్దాల బంధాన్ని విచ్ఛిన్నం చేసింది. తనకు విడాకులు ఇప్పించాలంటూ అతడి భార్య కోర్టుకెళ్లారు.
విజయవాడ ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల ప్రియాంక తన 31 ఏళ్ల వైవాహిక బంధం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబంలో కలతలు ఉన్నా పిల్లల పెంపకం కోసం సర్దుకుపోయానని.. అయినా భర్త తనను అర్థం చేసుకోవడం లేదని పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు పాశ్చాత్య దేశాలకే పరిమితం. ఇప్పుడు మన దేశంలోని పట్టణాలకూ ఇది పాకింది. నడివయసు దాటిన వారు.. వైవాహిక జీవితంలో కొందరు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతుంటే.. చాలామంది విడిగా ఉంటున్నారు.
సాక్షి, అమరావతి: పాతికేళ్ల వైవాహిక జీవితం గడిపినవారు విడిపోవడాన్ని ‘సిల్వర్ డైవర్సీ’ లేదా ‘గ్రే డైవర్సీ’గా చెబుతారు. రాష్ట్రంలోని ఒక్క విశాఖ జిల్లాలోనే కుటుంబ న్యాయస్థానానికి ఏటా 3 వేలకు పైగా విడాకుల కేసులు వస్తుండగా.. వాటిలో కనీసం 15 నుంచి 20 శాతం వరకు 25 ఏళ్లకు మించి వైవాహిక జీవితం గడిపిన జంటలు ఉంటున్నాయి. వివాహ బంధాన్ని ఎంతో పవిత్రంగా భావించే మన దేశంలో నడివయసు దాటినవారు విడిపోవాలని కోరుకుంటున్న తీరుపై ఐక్యరాజ్య సమితి (యూఎన్‌వో) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. యూఎన్‌వో ‘ప్రోగ్రెస్ ఆఫ్ ది వరల్డ్స్ ఉమెన్ రిపోర్టు–2010’ ప్రకారం భారతదేశంలో 45–49 ఏళ్ల వయసు మహిళల్లో విడాకులు తీసుకుంటున్న వారు 1.1 శాతం ఉండగా.. 2019–20 నాటికి రెండింతలైనట్టు అంచనా వేసింది.
అపోహలు.. అనర్థాలతో తెగదెంపులు
మన దేశంలోనూ విడాకులు కోరుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. వీరిలో వృద్ధాప్యానికి చేరువైన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ‘భర్తను, ఇద్దరు బిడ్డలను మెప్పించేందుకు ఎంతో శ్రమించాను. భర్త, పిల్లలు సహా నన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు. ఇన్నేళ్ల నా సంసార జీవితంలో నాకంటూ ఏమీ లేదు. బాగా అలసిపోయాను. అందుకే విడాకులు తీసుకుంటున్నాను’ అంటున్న వారు ఎక్కువ మందే కనిపిస్తున్నారు. ‘ఉద్యోగరీత్యా ఇన్నేళ్లూ ఊళ్లు పట్టుకు తిరుగుతూ భార్యాబిడ్డల్ని పుట్టింట్లోనే ఉంచేశారు. ఏ అవసరం వచి్చనా మీరు నా పక్కన లేరు. ఇప్పుడు రిటైరై తిరిగొచ్చాక మీ అవసరం నాకు ఏముంటుంది’ అంటూ ఓ భార్య వైవాహిక బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు.
కుటుంబంలో భార్యాభర్తల మధ్య జరిగే మాటల యుద్ధం, బంధువులు, సన్నిహితులు ఇచ్చే ఉచిత సలహాలు బంధాలను విచి్ఛన్నం చేస్తున్నాయంటున్నారు సైకాలజిస్టులు. ఇటీవల 50 ఏళ్లు దాటిన వారిలో ఇది ఎక్కువ కనిపిస్తోందంటున్నారు. స్త్రీ, పురుషుల్లో ఆర్థిక స్వేచ్ఛ, ప్రపంచ సంస్కృతులు ఇందుకు కారణమవుతున్నాయంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. విడాకుల కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానం, గుజరాత్ రెండు, పశి్చ మ బెంగాల్ మూడు, ఉత్తర ప్రదేశ్ నాలుగు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉన్నాయి.
ఒకరి ఉనికిని మరొకరు గౌరవించుకోవాలి
గతంలో పురుషులు సంపాదించాలి.. స్త్రీ ఇల్లు చక్కదిద్దాలని ఉండేది. మన సమాజంలో సంపాదించే స్థాయిలో ఉన్నవారు ఇల్లు చూసుకునే వారికి విలువ ఇవ్వరు. అక్కడే సమస్య మొదలవుతుంది. ఏళ్ల తరబడి మనసులో ఉన్న అసహనం పెల్లుబుకుతుంది. అప్పటికీ పిల్లల భవిష్యత్ కోసం మానసిక క్షోభను భరిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఒకరి ఉనికిని మరొకరు గౌరవించుకుంటే ఇబ్బంది రాదు. కానీ జరుగుతున్నది వేరు. అందువల్ల పిల్లలు స్థిరపడ్డాక విడిపోయేందుకు భార్యాభర్తలు సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేస్తే విడిపోయే ప్రసక్తి ఉండదు.
– డాక్టర్ జి.పద్మజ, విభాగాధిపతి, సెంటర్ ఫర్ హెల్త్ సైకాలజీ హెచ్‌ఓడీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
విడాకులు బాగా పెరిగాయి
గతంతో పోలిస్తే పట్టణాల్లో ఆరి్థక స్వేచ్ఛ పెరిగింది. సంపాదనలో ఆడ, మగా సమానంగా ఉంటున్నారు. కుటుంబంలో సమస్య వచి్చనప్పుడు సర్దుబాటు చేసుకోవడం లేదు. తక్కువ వయసులో వివాహం చేసుకున్న వారిలో ఎక్కువ మంది విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. అదే 35 ఏళ్లు తర్వాత పెళ్లి చేసుకున్న వారిలో ఈ సమస్య కనిపించడం లేదు. రెండో పెళ్లిళ్లు కుదిర్చేందుకు 1997లో మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేశాం. అప్పట్లో తక్కువ వయసు వారే రెండో వివాహ సంబంధానికి వచ్చేవారు. ఇప్పుడు నెలకు 10–12 మంది సంప్రదిస్తుంటే వారిలో కనీసం నలుగురు 50–55 ఏళ్లు పైబడి, విడాకులు తీస్తున్నవారు ఉంటున్నారు. ఇటీవల మహిళలు కూడా ఎక్కువగా వస్తున్నారు.
– పి.వెంకట్‌రెడ్డి, తోడు–నీడ మ్యారేజ్ బ్యూరో
Comments
Please login to add a commentAdd a comment