
ఒంగోలు/నెల్లూరు (సెంట్రల్): వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి పేదల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతగా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మద్య నియంత్రణ కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువగా పట్టణ ఓటర్లు కృతజ్ఞత చూపేందుకు ముందుకు రావాలని కోరారు. శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రెస్‌క్లబ్, నెల్లూరులోని మాగుంట లే అవుట్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కరోనా కష్ట కాలంలోనూ ఆకలి మరణాలు లేకుండా ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం రూపంలో నగదు అందించడం ద్వారా ఆ కుటుంబాలు ఆర్థిక సంక్షోభానికి గురికాకుండా తట్టుకోగలిగాయని లక్ష్మణరెడ్డి స్పష్టం చేశారు. ఓటు ఎవరికి వేశారనే దానితో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తున్నారని చెప్పారు. ఏపీ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పాలడుగు విజేంద్ర బహుజన్, జనచైతన్య వేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.