మంత్రి రజిని సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న హెచ్‌సీజీ ప్రతినిధి, ఏపీవీవీపీ కమిషనర్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా, జాతీయంగా ప్రసిద్ధి చెందిన వైద్య సంస్థల సహకారంతో రాష్ట్రంలోని క్యాన్సర్ రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. గురువారం మంగళగిరిలోని మంత్రి కార్యాలయంలో దేశంలోనే ప్రతిష్టాత్మక క్యాన్సర్ వైద్య సంస్థ అయిన హెల్త్ కేర్ గ్లోబల్ సంస్థతో రాష్ట్ర వైద్య శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ అతిపెద్ద నెట్‌వర్క్ కలిగిన హెల్త్‌కేర్ గ్లోబల్ సంస్థ అంతర్జాతీయ వైద్యులతో క్యాన్సర్‌కు చికిత్స అందిస్తోందని చెప్పారు. క్యాన్సర్‌లను గుర్తించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులకు శిక్షణ ఇవ్వడం, న్యూట్రిషన్, యోగా తదితర అంశాలపై తర్ఫీదు అందించడంతోపాటు ప్రతి నెలా జిల్లా ఆస్పత్రుల్లో 30 క్యాంపులు నిర్వహించడం వంటివాటిపై ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
క్యాన్సర్ రోగుల విషయంలో సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని మంత్రి రజిని వివరించారు. ప్రతి రోగికి అత్యాధునిక వైద్యం పూర్తి ఉచితంగా మన రాష్ట్రంలోనే అందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇందుకోసం కడప, కర్నూలులో రాష్ట్ర స్థాయి క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో క్యాన్సర్ వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్క క్యాన్సర్ రోగానికి సంబంధించే 400కు పైగా ప్రొసీజర్లను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ వైద్యానికే రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నవీన్‌కుమార్, జె.నివాస్, డాక్టర్ వినోద్‌కుమార్, డాక్టర్ బి.వల్లీ, హెచ్‌సీజీ ప్రతినిధులు డాక్టర్ ఈఎస్ విశాల్‌రావు, డాక్టర్ రవికిరణ్, డాక్టర్ అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment