‘చంద్రబాబు మాటలన్నీ బూటకాలే’ | Vidadala Rajini On Chandrababu Medical colleges | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు మాటలన్నీ బూటకాలే’

Published Fri, Sep 23 2022 4:36 AM | Last Updated on Fri, Sep 23 2022 7:37 AM

Vidadala Rajini On Chandrababu Medical colleges - Sakshi

గుంటూరు మెడికల్‌: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాటలన్నీ బూటకాలేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. వైద్య కళాశాలల విషయంలో చంద్రబాబుతోపాటు ఆ పార్టీ నేతలు అసత్యాలు వల్లిస్తున్నారని మండిపడ్డారు. గురువారం సాయంత్రం గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు.  

విభజన చట్ట ప్రకారమే ఎయిమ్స్‌.. 
టీడీపీ నేతలు గోబెల్స్‌ ప్రచారంలో ముందుంటారు. మంగళగిరి ఎయిమ్స్‌ ఆస్పత్రిని తామే తెచ్చినట్లు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన నిధులతో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వానికి, ఎయిమ్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. టీడీపీ నేతల పోరాటాల వల్లే వచ్చిందని చెప్పడం హాస్యాస్పదం.  

► అసెంబ్లీలో ప్రకటించినట్లుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు 11 మాత్రమే. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిమ్స్‌ను, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పద్మావతి మెడికల్‌ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలంటూ టీడీపీ గోబెల్స్‌ ప్రచారం చేస్తోంది.  

వైఎస్సార్‌ ఆలోచనే తిరుపతి కళాశాల 
తిరుపతిలో పద్మావతి మహిళా వైద్య కళాశాలను మహిళల కోసం ప్రత్యేకంగా నిర్మించాలని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తలచారు. నెల్లూరులో కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటైందంటే వైఎస్సార్‌ చొరవే కారణం. తిరుపతి, నెల్లూరులో వైద్య కళాశాలల నిర్మాణాల కోసం 2007లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంచనాలు రూపొందించి ఆ తరువాత బడ్జెట్‌ కేటాయింపులు చేశారు. 2013 చివరి నాటికి ఆ కళాశాలలకు అనుమతులు, భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. 2014 ఆగస్టులో వాటిలో అడ్మిషన్లు చేపట్టారు. రెండు మెడికల్‌ కళాశాలలు డాక్టర్‌ రాజశేఖరరెడ్డి చలువ వల్లే రాష్ట్రానికి వచ్చాయి.

అనంతరం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2014 ఆగస్టులో వాటిని ప్రారంభించారు. వాటిని తానే తెచి్చనట్లు చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు. పద్మావతి మెడికల్‌ కళాశాలలో ఎన్నారై కోటా కింద 23 సీట్లు అమ్ముకోవచ్చంటూ చంద్రబాబు సర్కారు దుర్మార్గంగా జీవో ఇచ్చింది. అందుకే భగవంతుడు టీడీపీకి గుర్తుండేలా ఆ పార్టీని 23 సీట్లకు పరిమితం చేసి గత ఎన్నికల్లో శిక్ష విధించారు. రాష్ట్రంలో 18 ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలలు ఉంటే 13 కాలేజీలకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబే. టీడీపీ హయాంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 

► పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ రంగంలో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు.  
► ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు, 104 వాహనాలు, వైద్య కళాశాలల ఏర్పాటుతో మనసున్న డాక్టర్‌గా వైఎస్‌ రాజశేఖరరెడ్డి చరిత్రలో గొప్ప నాయకుడిగా నిలిచారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement