
సాక్షి, అమరావతి: నాలుగు అంశాలు ప్రధానంగా చర్చించామని, కోర్టు కేసును త్వరగా డిస్పోజ్ చేసేలా కోర్టును కోరనున్నామని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తెలిపారు. సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ గ్రామ సమస్యపై హైపవర్ కమిటీ భేటీ గురువారం జరిగింది. ఈ భేటీలో మంత్రి వెల్లంపల్లి, ఎంపీ విజయసాయిరెడ్డి, దేవాదాయశాఖ అధికారులు పాలొన్నారు. భేటీ అనంతరం ఎంపీ విజయసాయరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 12,149 మంది నివాసం ఉంటున్నారని, వారందరికి రెగ్యులర్ చేయాలనేది ఇక్కడివారి ప్రధాన సమస్య అని తెలిపారు.
కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతులు చెసుకోవచ్చని, ఇంకో ఫ్లోర్‌కి అనుమతి ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఈ అంశాలు ప్రభుత్వం అనుమతి తీసుకుని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పూరిపాకలో నివసించే వారికి పక్క ఇల్లు కట్టుకునే అవకాశం ఉందని, ఆక్రమణలు జరుగుతున్నాయని.. అందుకే రూ. 20 కోట్లతో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలని నిర్ణయించామని చెప్పారు.
ఈ నిధులు భక్తులు, దాతల నుంచి సేకరిస్తామని, గిరి ప్రదిక్షణం చేసుకునేలా ఈ వాల్ నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు. కోర్టు సలహా తీసుకుని ఈ సూచనలన్నీ చేపడతామని అన్నారు. సింహాచల దేవాలయ భూములను కాపాడాలన్నదే తమ ధ్యేయమని, అక్కడ ఉంటున్నవారికి న్యాయం చేస్తామని తెలిపారు.
అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పంచ గ్రామాల సమస్యపై భేటీ అయ్యామని, నిర్వాసితులకు న్యాయం జరిగే దిశగా చర్చలు జరిపామని తెలిపారు. దేవాలయ స్థలాలను ఎలా కాపాడాలనే అంశంపై కూడా చర్చించామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment