ఆందోళన చేపట్టిన కోనసీమ జిల్లా నారాయణలంక గ్రామస్తులు
కొత్తపేట: ఉచిత ఇసుక మాటున టీడీపీ నేతల అండదండలతో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను వెంటనే అరికట్టాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, కపిలేశ్వరపురం మండలాల సరిహద్దు ప్రాంతమైన నారాయణలంక గ్రామస్తులు శనివారం ఆందోళన చేపట్టారు. నారాయణలంక సమీపాన గోదావరి లంక ప్రాంతంలో రెండు రోజులుగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.
అనధికారికంగా ఇసుక ర్యాంపు నిర్వహణకు పొలాల మధ్య నుంచి పూర్తి స్థాయిలో బాట ఏర్పాటు చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న కపిలేశ్వరపురం తహసీల్దార్ చిన్నారావు, అంగర ఎస్సై రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అడ్డూ అదుపూ లేని ఇసుక, మట్టి తవ్వకాలతో గోదావరి వరదల సమయంలో తమ జిరాయితీ భూములు కోతకు గురై నదిలో కలిసిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల కారణంగా ఇప్పటికే వందలాది ఎకరాలు నదీగర్భంలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఎటువంటి అనుమతి లేకుండా రాత్రి వేళల్లో యంత్రాలతో ఇసుక, బొండు మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారని ఆరోపించారు.
వాహనాల్లో ఇసుకను తరలించేందుకు తమ పొలాల్లోంచి అక్రమంగా బాట వేశారని కొందరు రైతులు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ చిన్నారావు మాట్లాడుతూ, అక్రమ తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఈ సమస్యపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment