సహాయక చర్యలకు వలంటీర్లను పిలవాలని మునిసిపల్ కమిషనర్ ఆదేశం
పలు ప్రాంతాల్లో వరద బాధితులకు సేవలందిస్తోన్న వలంటీర్లు
సాక్షి, అమరావతి/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ‘వలంటీర్లు ఏమి చేస్తారు, సంచులు మోసే పనులే కదా..అంతకుమించి వారు చేసే పనులు ఏమిటి?’ అంటూ చంద్రబాబు నాడు వలంటీర్లను ఎద్దేవా చేశారు. అయితే వరద బీభత్సానికి పాలకులకు దిమ్మతిరిగి వరద బాధితులకు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి వలంటీర్లే అవసరమవుతారని ఇప్పుడు గుర్తించారు. సచివాలయం, వలంటీర్ వ్యవస్థల పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడని చంద్రబాబుకు వారి విలువలు, సేవలు ఇప్పుడు తెలిసివచ్చాయి.
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సాయమందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఆహారం భారీగా ఉన్నా పంపిణీ వ్యవస్థ సరిగా లేక గందరగోళ పరిస్థితులు తలెత్తుతుండటంతో అధికారులు వలంటీర్ల ద్వారానే బాధితులకు సాయమందించగలమని సీఎంకు చెప్పారు. దీంతో వెంటనే సీఎం ఆదేశాలతో అధికారులు వలంటీర్లకు కబురు చేస్తున్నారు.
బుధవారం నుంచి సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు ఎక్కడికక్కడ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. నేటి నుంచి పూర్తి స్థాయిలో వలంటీర్లు సేవలు అందించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
గతంలో వరదలొస్తే వలంటీర్లతోనే బాధితులకు భోజనం ఏర్పాట్లు
గోదావరి వరద ముంపులో ఉన్న వందలాది మంది బాధితుల వద్దకు పీకల్లోతు నీళ్లలో వెళ్లి వలంటీర్లు తక్షణ సాయాన్ని అందించి వెలకట్ట లేని సేవలతో ప్రశంసలు అందుకున్నారు. 2020, 2022ల్లో గోదావరికి వరదలు వచ్చిన సమయంలో..వరదలు వస్తాయన్న ముందస్తు సమాచారంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ ముందుగానే వలంటీర్లను అప్రమత్తం చేసి బా«ధితులను ఆదుకున్నారు. అధికారులు కూడా వెళ్లడానికి సాహసించని లోతట్టు లంక గ్రామాలకు ప్రాణాలకు తెగించి ప్రభుత్వం సమకూర్చిన సహాయ సామగ్రి, నిత్యావసరాలను బాధితులకు వలంటీర్ల కొద్ది గంటల్లోనే అందించారు.
గతంలో వరదల సమయంలో గోదావరి ఏటిగట్లకు గండ్లు పడి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించిన సందర్భాలు కోకొల్లలుగా ఉండగా, 20219–23 మధ్య వరదల సమయంలో ప్రతి అర కిలో మీటర్ ఏటిగట్టు పర్యవేక్షణ బాధ్యత ఒక వలంటీర్‌కు అప్పగించడంతో వారు ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. అప్పట్లో ఏటిగట్లకు ఊలలు పడినా, గట్లు కుంగిపోయినా, గండ్లు పడిన విషయం ఉన్నతాధికారులకు చేరేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయేది. వలంటీర్లు వరద సేవల్లో పాల్గొన్నప్పుడు, వరదల్లో చిక్కుకున్న బాధితులను గుర్తించడం దగ్గర నుంచి పునరావాస కేంద్రాలకు తరలింపు, భోజనాలు, నిత్యావసరాల పంపిణీలో ప్రాణాలకు తెగించి సేవలందించారు.
మధ్యాహ్నం 12 గంటలు దాటకుండానే బాధితులకు భోజనం ప్యాకెట్లు, మంచినీళ్లు అందించారు. 2020, 2022 జూలై, ఆగస్ట్‌ల్లో సంభవించిన వరదల్లో మామిడికుదురు మండలం పెదపట్నం గ్రామంలోనైనా, బి.దొడ్డవరం, అప్పనపల్లి బాడవ గ్రామాల్లో మోకాలికిపైగా నీటిలో వలంటీర్లు నడచి భుజాలపై ఆహార పొట్లాలు తీసుకువెళ్లి ఊరందరికీ ఆహారం, తాగునీటి ప్యాకెట్లు అందజేశారు. నాటి వరదల్లో జగన్ ప్రభుత్వం ఉచితంగా నిత్యావసరాలు, కూరగాయలను ఏటిగట్లకు చేర్చితే, ఏటిగట్టు నుంచి ఏ గ్రామానికి ఆ గ్రామ వలంటీర్ బాధ్యతగా తీసుకుని పడవలో తీసుకువెళ్లి అందించారు.
Comments
Please login to add a commentAdd a comment