సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమ ప్రాంతం అన్నివిధాలుగా సస్య శ్యామలం అవుతుందని వారి నమ్మకం. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి హాయాంలో పట్టాలెక్కిన పోలవరం ప్రాజెక్టు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పరుగులు పెడుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం జరుగుతుండగానే తొలి ఫలితం రాబోతుంది. గోదావరి డెల్టాకు పోలవరం మీదుగా నీటిని విడుదల కార్యక్రమానికి శుక్రవారం అంకురార్ఫణ జరిగింది.
పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి నది సహజ ప్రవాహాన్ని అప్ప్రోచ్ ఛానల్ గుండా స్పిల్ వేకు మళ్లించిన సందర్భంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాన్ని జలవనరుల శాఖ, మేఘా ఇంజనీరింగ్ అధికారులు చేశారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్ బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి, ఈఈలు మల్లి ఖార్జునరావు, ఆదిరెడ్డి, బాలకృష్ణ, మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎంలు ముద్దుకృష్ణ, దేవ్ మని మిశ్రా, సీజీఎం రవీంద్రరెడ్డి, ఎజీఎం రాజేశ్, డీజీఎం శ్యామలరావు, మేనేజర్ మురళి పాల్గొన్నారు.
గోదావరి డెల్టా సస్యశ్యామలం..
గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్‌కు విడుదల చేయడం ద్వారా ఆ నీరు స్పిల్ వే.. రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు చేరి అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు.. పశ్చిమ కాల్వల ద్వారా గోదావరి డెల్టా మొత్తాన్ని సస్య శ్యామలం చేయనుంది. సహజంగా గోదావరిలో ప్రవహించే నీరు బ్యారేజ్ నుంచి డెల్టాకు అందుతుంది. పోలవరం పూర్తయిన తరువాత స్పిల్ వే.. రివర్ స్లూయిజ్.. పవర్ హౌస్ డిశ్చార్జ్‌ల ద్వారా బ్యారేజ్‌ల నుంచి కాలువలకు చేరుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగానే నీరు గోదావరి డెల్టాకు చేరుతుండడం వల్ల పోలవరం తొలి ఫలితం అందుతున్నట్లయ్యింది.
ఇకపై అప్రోచ్ ఛానెల్ ద్వారా నీటి విడుదల..
పోలవరం నిర్మాణంలో స్పిల్ వే తో పాటు మూడు గ్యాపులు (ఈసీఆర్ఎఫ్ 1,2,3)తో పాటు జల విద్యుత్ కేంద్రం, జల రవాణా పనులు కీలకమైనవి. ఇందులో ఇంజనీరింగ్ నిబంధనలకు అనుగుణంగా (వర్క్ మ్యానువల్, ప్రోటోకాల్) స్పిల్ వే పనిని మేఘా ఇంజనీరింగ్ ఛాలెంజ్‌గా తీసుకొని పూర్తి చేసింది. గోదావరి నీటిని అప్రోచ్ ఛానెల్ నుంచి దిగువకు విడుదల చేయడం ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పోలవరం దిగువన ఉన్న తాడిపూడి, పట్టిసీమ, పుష్కరం తదితర ఎత్తిపోతల పథకాల ద్వారా తాగు, సాగు నీరు ఇక నుంచి ఈ అప్రోచ్ ఛానెల్ ద్వారానే విడుదల కానుంది. దీంతో ఇక నుంచి ఏడాది పోడవునా నీటిని అప్రోచ్ ఛానెల్ ద్వారా మళ్లించి మళ్లీ పైలెట్ ఛానెల్ ద్వారా గోదావరిలోకి కలుపుతారు.
6.6 కిలోమీటర్ల మేర నది మళ్లింపు ఓ అద్భుతం..
గోదావరి నది నీటిని 6.6కిలోమీటర్ల మేరకు మళ్లించడం అంటే సాధారణ విషయం కాదు. ఇది ప్రపంచంలోనే అరుదైన సంఘటన. దేశంలోనే రెండో పెద్ద నది అయిన గోదావరిపై ఇలాంటి ప్రయత్నం చేయడం సాహసమే. సహజంగా ప్రవహించే గోదావరిని పోలవరం వద్ద కుడి వైపునకు అంటే అప్రోచ్ ఛానెల్ నుంచి పైలెట్ ఛానెల్ వరకు మళ్లిస్తారు. ఇప్పుడు మొదలవుతున్న ఈ నీటి ప్రక్రియ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత కూడా అలాగే కొనసాగుతుంది.
నది మధ్య భాగంలో పనులు..
నదీ మధ్య భాగంలో మూడు గ్యాపులు (1,2,3) నిర్మించాలి. అందులో గ్యాప్-2 గా పిలిచే ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం) అతిపెద్దది. 50 లక్షల క్యూసెక్కుల నీటి ఒత్తిడిని తట్టుకునేలా దీనిని నిర్మిస్తారు. ఈ పని ప్రారంభం కావాలంటే నీటి ప్రవాహం నిలిపివేయాలి. అందుకోసం అప్పర్ కాఫర్ డ్యాం నిర్మించి ఈ ఏడాది వచ్చే వరదల్లో కూడా ఈసీఆర్ఎఫ్ నిర్మాణ పనులు కొనసాగించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ నది మళ్లింపు చేపట్టారు.
వరదలను తట్టుకునేలా అప్రోచ్ ఛానెల్ నిర్మాణం..
అప్రోచ్ ఛానెల్, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ పొడవు 6.6 కిలోమీటర్లు ఉంది. ఇవి ప్రధాన నదికి కుడివైపున సమాంతరంగా నిర్మించారు. అప్రోచ్ ఛానెల్ స్పిల్ వే వైపు 2.4 కిలోమీటర్లు వరకు నిర్మించారు. స్పిల్ వే నుంచి స్పిల్ ఛానెల్ 3.1 కిలోమీటర్లు, స్పిల్ ఛానెల్ చివరి నుంచి మళ్లీ గోదావరి తన సహజసిద్ధ ప్రవాహంలోకి కలిసే విధంగా 1.1 కిలోమీటర్లు పైలెట్ ఛానెల్ నిర్మించారు. ఎగువ కాఫర్ డ్యాం మూడు రీచ్లుగా 2480 మీటర్ల పొడవు, 42.5 మీటర్ల ఎత్తున నిర్మించారు. ఇటీవలనే అప్పర్ కాఫర్ డ్యాం గ్యాపులను ప్రభుత్వ నిర్ణయానుసారం మేఘా ఇంజనీరింగ్ పూడ్చివేసింది. ఫలితంగా 30 లక్షల క్యుసెక్కుల వరకు వరద వచ్చినా నదిలో నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవాహం అప్రోచ్ ఛానెల్ మీదుగా వెళ్లిపోతుంది.
రికార్డ్ స్థాయిలో పనులు చేపట్టిన ‘మేఘా’..
గోదావరి నది ప్రవాహాన్ని మళ్లించే పనులను మేఘా ఇంజనీరింగ్ రికార్డ్ సమయంలో పూర్తి చేసింది. గోదావరి ప్రవాహం కుడివైపునకు మళ్లీ స్పిల్ వేకు చేరాలంటే కనీస మట్టానికి తవ్వాలి. అందుకోసం అప్రోచ్ ఛానెల్ ను 2.4 కిలోమీటర్ల మేర తవ్వేశారు. దాంతో పెద్ద నది రూపుదిద్దుకుంది. ఇందుకోసం కోటి 54 లక్షల 88వేల మట్టి తవ్వకం పనులు చేయాల్సి ఉండగా ఇప్పటికి కోటి 4లక్షల 88వేల ఘనపు మీటర్లు పూర్తయింది. ఇందుకోసం రేయింబవళ్లు యంత్రాంగం పని చేసింది. మొత్తం మట్టి పని 5 కోట్ల 92 లక్షల పనికి గాను 5 కోట్ల 24 లక్షల ఘనపు మీటర్ల మేర పూర్తయ్యింది. మొత్తం సిసి బ్లాకులు (స్పిల్ వే) 17 లక్షల ఘనపు మీటర్లు కాగా 15.17 లక్షల ఘనపు మీటర్ల పని పూర్తయ్యింది.
హైడ్రాలిక్ గేట్లు..
ప్రపంచంలో ఇంతవరకు అతిపెద్ద వరద డిశ్చార్జ్ స్పిల్ వే గా త్రిగాడ్జెస్ జలాశయంకు పేరుంది. దీని కన్నా పోలవరం సామర్థ్యం మూడు లక్షల క్యుసెక్కులు అధికం. దీనిని తట్టుకునే విధంగా ప్రపంచంలోనే అతపెద్ద గేట్ల ఏర్పాటు పూర్తయింది. ఇందుకోసం 15.17 ఘనపు మీటర్ల కాంక్రీట్ పని పూర్తయ్యింది. గేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అందులో భాగంగా 22 పవర్ ప్యాక్ లను 44 గేట్లకు అమర్చారు. 28 రేడియల్ గేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో ఈ సీజన్లో వరద వచ్చినా విడుదల చేసే విధంగా 28 గేట్లను ఎత్తి ఉంచారు.
చదవండి: YS Jagan: రాష్ట్రాభివృద్ధి సాకారానికి.. కావాలి.. మీ సహకారం
పోలవరం పనులపై కేంద్రం ప్రశంస
Comments
Please login to add a commentAdd a comment