చెట్లకు డబ్బులు పండడంలేదు
మంత్రి అచ్చెన్నాయుడు
టెక్కలి : ‘గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారు. ఇప్పుడు అధికారులతో సర్వే చేయించి అనర్హుల పింఛన్లు తొలగిస్తాం’.. అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో శనివారం గ్రామ సచివాలయం, రైతుసేవా కేంద్రం, వెల్‌నెస్ సెంటర్ ప్రారంభోత్సవంతో పాటు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నీ ఇవ్వాలంటే తమ దగ్గర అక్షయపాత్ర లేదని.. చెట్లకు డబ్బులు పండడంలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నంగా ఉందని.. సొంత డబ్బులతో అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.
తమ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రావివలస ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమను తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అనంతరం టెక్కలి జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అర్హత లేని వారి పెన్షన్లు తొలగిస్తాం :స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం: అర్హత లేని వారి పెన్షన్లు తొలగిస్తామని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మండలం, ధర్మసాగరంలో శనివారం ఆయన వృద్ధాప్య, వితంతు పింఛను సొమ్ము స్వయంగా అందజేశారు. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేపట్టామని తెలిపారు. అక్టోబర్2 నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment