సాక్షి, అమరావతి: పట్టణ పేద ప్రజల కోసం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల మెరుగైన నిర్వహణకు ‘రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు’ ఏర్పాటు చేయనున్నారు. సొసైటీల చట్ట నిబంధనలకు అనుగుణంగా ఇవి ఏర్పాటు కానున్నాయి. మొత్తం 88 యూఎల్బీల్లో 2,62,212 ఇళ్లను జీ+3 అంతస్తులతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 163 ప్రాంతాల్లో ఉన్న వీటిని వైఎస్సార్ జగనన్న నగరాలుగా వ్యవహరిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కోచోట వెయ్యి నుంచి 11,500 ఇళ్ల వరకు నిర్మిస్తున్నారు.
ఇవి అపార్టుమెంట్లే అయినప్పటికీ ఒక్కో ప్రాంగణం చిన్న తరహా పట్టణాన్ని తలపిస్తోంది. దీంతో ప్రతి వెయ్యి నివాసాలకు ఒక కమిటీ చొప్పున సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చెత్త సేకరణ, వీధిలైట్లు, తాగునీటి సరఫరా, ఎస్టీపీల నిర్వహణ లాంటి పనులను స్థానిక మున్సిపాలిటీలే నిర్వర్తిస్తాయి. అంతర్గత నిర్వహణను యజమానులకే అప్పగిస్తారు.
అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో మాదిరిగా టిడ్కో ఇళ్లకు సంక్షేమ సంఘాల కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లకు ఈ తరహా కమిటీల ఏర్పాటు ఇదే తొలిసారి. ఈ మేరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ కమిషనర్లతో పాటు ఆర్జేడీలకు ఏపీ టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ లేఖ పంపారు.
కమిటీల విధులపై నివాసితులతో చర్చించి ఈనెల 10లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. గృహ నిర్మాణ రంగంపై ఇటీవల గుజరాత్‌లో నిర్వహించిన సదస్సుకు హాజరైన టిడ్కో అధికారులు అక్కడ అపార్ట్‌మెంట్ల నిర్వహణను పరిశీలించి ముసాయిదా సిద్ధం చేశారు. కాగా, అక్టోబరు చివరి నాటికి 40,575 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
మెరుగ్గా అంతర్గత నిర్వహణ..
కమిటీలు ఉంటే అంతర్గత నిర్వహణ సులభతరమవుతుంది. కారిడార్లు, ప్రాంగణాల నిర్వహణ, మోటార్ల నిర్వహణ లాంటివి ఇళ్ల యజమానులే పర్యవేక్షించేందుకు కమిటీలు ఉంటే మంచిది. ఇవి ఏకరీతిన ఉండాలని భావిస్తున్నాం. రాష్ట్రంలో 2.62 లక్షలకు పైగా టిడ్కో ఇళ్లు నిర్మిస్తున్నాం. ప్రతి వెయ్యి నివాసాలకు ఒక కమిటీ చొప్పున మొత్తం 262 రెసిడెన్షియల్ వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటవుతాయి. తద్వారా దేశంలో ఈ తరహా కమిటీలను నియమించిన తొలి రాష్ట్రం ఏపీ అవుతుంది.
– చిత్తూరి శ్రీధర్, టిడ్కో ఎండీ
Comments
Please login to add a commentAdd a comment