
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): జిల్లా కలెక్టర్ ప్రశాంతికి రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాకేంద్రంలో బుధవారం జరిగిన 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేతులమీదుగా కలెక్టర్ పి.ప్రశాంతి రాష్ట్రస్థాయి బెస్ట్ ఎలక్ట్రోలర్ ప్రాక్టీస్ అవార్డును అందుకున్నారు.
ఓటరు చైతన్య కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడం, అత్యధిక ఓటర్ల నమోదు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపునకు సంబంధించి రాష్ట్రంలో ముగ్గురు కలెక్టర్లకు అవార్డులు ప్రకటించగా వారిలో ప్రశాంతి ఒకరు. అవార్డు అందుకున్న కలెక్టర్ ప్రశాంతికి జిల్లా ఉద్యోగులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.