మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయింది. నేటికీ విభజన హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విభజన సమస్యలపై దృష్టి సారించాలి’ అని మాజీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కోరారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు, వైఎస్ జగన్ ప్రభుత్వాలు కాపాడలేకపోయాయి. 9, 10 షెడ్యూళ్ల ప్రకారం తెలంగాణలోని ఉమ్మడి ఆస్తులు రూ.1,42,601 కోట్లలో విభజన హామీల ప్రకారం 58 శాతం నిధులు ఏపీకి రావాలి.
ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏపీకి తీరని అన్యాయం జరుగుతోంది. రిసోర్స్ గ్యాప్ రూ.32,652 కోట్లను కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉండగా.. రూ.5,617 కోట్లే ఇచ్చి చేతులు దులుపుకుంది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.24,350 కోట్లు ఇస్తామని ప్రకటించిన కేంద్రం.. రూ.1,750 కోట్లే ఇచ్చింది. ఏపీకి రూ.6,700 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే పూర్తి చేయాల్సి ఉంది. కానీ రాష్ట్రం అడిగితే ఇచ్చామని కేంద్రం లోక్‌సభలో చెప్పింది. కేంద్రమే ఇచ్చిందని రాష్ట్ర శాసనసభలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది.
అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే ఇచ్చారా? అడగకుండా ఇచ్చారా? వంటి అంశాలకు సంబంధించి లిఖిత పూర్వకంగా ఎక్కడా లేదు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారకులు ఎవరు? అధికారుల వైఫల్యమా? తదితర విషయాలు తేల్చకుండా రాజకీయ నాయకులను బాధ్యులను చేయడం సరికాదు. రాష్ట్ర విభజన అంశంపై సుప్రీంకోర్టులో నేను వేసిన పిటిషన్‌పై వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల సమయం ఉన్నా.. చంద్రబాబు ప్రభుత్వం ముందుగానే అమరావతికి వచ్చేసి సొంత దుకాణం పెట్టింది. దీంతో రాష్ట్ర పరిస్థితి దారుణంగా మారింది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment