సామర్లకోట: వంట చేయడానికి వంట గదిలోకి వెళ్లిన ఓ మహిళ గ్యాస్ మంటలకు ఆహుతైన విషాద సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బ్రౌన్ పేట కుమ్మర వీధికి చెందిన గుబ్బల భవాని (35) శనివారం వంట చేయడానికి గ్యాస్ స్టౌను అగ్గిపుల్లతో వెలిగిస్తోంది. స్టౌ వెలగకపోవడంతో అలాగే ఉంచి పలుమార్లు అగ్గిపుల్లలు వెలిగింది. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో గ్యాస్ లీకైంది. ఆ సమయంలో అగ్గిపుల్ల వెలగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి, భవాని సజీవ దహనమైంది. లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న భర్త చిన్న కుమారుడిని తీసుకొని బయటకు వెళ్లాడు. ఇంటి సమీపంలో భవాని ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తోంది.
షాపు వద్ద పెద్ద కుమారుడు, అత్తను ఉంచి, మధ్యా హ్నం వంట చేయడానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంటి నుంచి మంటలు రావడం, భవాని కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న ఆమె బావ కుమారుడు గమనించి, భవాని పెద్ద కుమారుడిని తీసుకుని అక్కడకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న నీటితో మంటలు అదుపు చేశారు. అప్పటికీ గ్యాస్ లీకవడం గమనించి వారు అదుపు చేశారు. విషయం తెలిసిన వెంటనే పెద్దాపురం సీఐ వి.జయకుమార్, ఎస్సై వీఎల్‌వీకే సుమంత్, వార్డు కౌన్సిలర్ పిట్టా సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్టౌ వద్ద ఐదు అగ్గిపుల్లలు ఉండటం గమనించారు. వెంటనే స్టౌ వెలగకపోవడం, గ్యాస్ వ్యాపించి ఉన్న సమయంలో మరో అగ్గిపుల్ల వెలగడంతో మంటలు వ్యాపించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
కాకినాడ రూరల్ పెనుమర్తికి చెందిన భవానీకి 16 ఏళ్ల క్రితం సామర్లకోట బ్రౌన్‌పేటకు చెందిన గుబ్బల రామకృష్ణతో వివాహమైంది. అత్త లక్ష్మి, పెద్ద కుమారుడు అర్జున్ గణేష్, చిన్న కుమారుడు వేణుతేజ ఉన్నారు. కుమార్తె మరణ వార్త తెలుసుకొని తల్లిదండ్రులు దెయ్యాల మహలక్ష్మి, కామరాజులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. భవానీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెద్దాపురం తరలించి, ఎస్సై సుమంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: అడ్డగోలు దోపిడీ: సీటీ ‘స్కామ్’
సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు
Comments
Please login to add a commentAdd a comment