సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనిషికి ఉన్న అవయవాల్లో అత్యంత సున్నితమైనది.. ప్రధానమైనది నేత్రాలే. వీటి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే జీవితం చీకటి మయమే. ఈ అందమైన ప్రపంచాన్ని చూసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా దూరమయ్యే వరకు కళ్లను భద్రంగా చూసుకోవాల్సిందే. వీటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఈ ఏడాది ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ‘మీ కళ్లను ప్రేమించండి‘ నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా నేత్రాల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలను వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది.
శ్రీకాకుళం అర్బన్: కళ్లను ఎవరూ నిర్లక్ష్యం చేయరాదు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకూ వీటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. పిల్లల కంటి సంరక్షణలో తల్లి పాత్ర కీలకం. బిడ్డ కళ్లను పరిశుభ్రంగా ఉంచి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. పుట్టిన బిడ్డ కళ్లను తల్లి నిత్యం గమనిస్తూ ఉండాలి. నేత్రాల్లో ఎటువంటి మార్పులు ఉన్న ఆలస్యం చేయకుండా వైద్యుడ్ని సంప్రదించాలి. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు బ్లాక్ బోర్డ్‌పై ఉన్న అక్షరాలు చూడటంలో ఇబ్బంది ఉన్నా, పుస్తకాన్ని, టీవీని దగ్గరుగా చూస్తున్నా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. విద్యార్థి దశలో ప్రతి ఏడాది కంటి పరీక్ష చేయిస్తూ వారి చూపుని పరిరక్షించాలి. దృష్టిలోపం ఉన్నట్లయితే వైద్యుని సలహా మేరకు కళ్లద్దాలు వాడాలి.
ఆధునిక జీవనశైలి– కంటిచూపుపై దుష్పరిణామాలు
గతంలో పిల్లలకు తల్లి చందమామని చూపిస్తూ ఆహారం తినిపించేది. ఇప్పుడు సెల్‌ఫోన్ చూపిస్తూ తినిపిస్తోంది. దీనివల్ల పిల్లల కళ్లలో సున్నితమైన రెటీనా భాగాలు పాడై చూపు పోయే ప్రమాదం ఉంది. పిల్లలు ఎక్కువగా సెల్‌ఫోన్ చూడడం, వీడియో గేమ్స్ ఆడడం వల్ల మెల్లకన్ను, దృష్టి లోపంతో పాటు వారి మానసిక ప్రవర్తనలో మార్పులు ఏర్పడుతున్నాయి. అందువల్ల వీలైనంత వరకు పిల్లలకు సెల్ ఫోన్ అందుబాటులో ఉంచకూడదు. ఇక సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసేవారు, కళాశాల విద్యార్థులు, కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ఉపయోగించినపుడు కళ్ల పట్ల శ్రద్ధ వహించాలి. స్క్రీన్‌పై వెలుతురు పడకుండా, కంటిపై నేరుగా గాలి తగలకుండా చూడాలి. కళ్లకు మధ్యలో విశ్రాంతిని ఇస్తూ అవసరమైతే వైద్యులు సూచించిన కంటి చుక్కల మందు ఉపయోగిస్తూ నేత్రాలను పరిరక్షించుకోవాలి.
వయోవృద్ధుల్లో భద్రత
35 సంవత్సరాలు దాటిన చాలామందిలో చదివేటప్పు డు ఇబ్బందికరంగా ఉంటుంది. మధుమేహగ్రస్తులు, రక్తపోటు ఉన్నట్లయితే ప్రతి ఏడాది తప్పనిసరిగా నేత్ర వైద్యుని సంప్రదించాలి. దానివలన శాశ్వత అంధత్వాని కి గురికాకుండా కళ్లను భద్రంగా ఉంచుకున్నవారవుతా రు. ఎవరికైనా గ్లకోమా ఉన్నట్లేనా ప్రతి ఏడాది సంపూర్ణ కంటి పరీక్ష తప్పనిసరి. ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి కంటిపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడగానే బీపీ, సుగర్ వ్యాధులకు గురవుతున్నారు. అటువంటి వారు డాక్టర్ సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి.
నిర్లక్ష్యం వద్దు
కంటి చూపు, సంరక్షణ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ చాలా అవసరం. ఏదైనా ఇబ్బంది గమనించినట్లయితే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. చాలామంది సరైన సమయంలో వైద్యులను సంప్రదించకపోవడంతో శాశ్వత అంధత్వానికి గురవుతున్నారు.
– ఎం.ఆర్.కె.దాస్, పారామెడికల్ ఆప్తాల్మిక్ అధికారి
అశ్రద్ధ చేయకండి
మనిషి జీవితంలో ప్రతీది దృష్టితో ముడిపడి ఉంది. అందుకే కళ్లను నిర్లక్ష్యం చేయరాదు. ప్రస్తుత జీవన విధానంలో వస్తున్న మార్పులు, దీర్ఘకాలిక వ్యాధులతో కంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆరు నెలలకు ఒక్కసారి కంటి వైద్యుడ్ని సంప్రదించాలి.
– డాక్టర్ వి.దినేష్‌కాంత్, రెటీనా నేత్ర వైద్య నిపుణులు
జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో దశ కింద గత ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ఈనెల 12వ తేదీ వరకూ నేత్ర పరీక్షలు ఇలా..
60 ఏళ్లకు పైబడిన ఉన్న వృద్ధులు: 3,24,764 మంది
కంటి పరీక్షలు చేసినవారి సంఖ్య: 96,128
ఉచిత కళ్లద్దాలకు సిఫారసు చేసిన వారి సంఖ్య: 41,995
కాటరాక్ట్ రిఫర్ చేసిన వారి సంఖ్య :11,857
శస్త్ర చికిత్సలు చేసిన వారి సంఖ్య : 9,600
స్క్రీనింగ్ బృందాలు : 27
చిన్నారి చూపు కార్యక్రమం ద్వారా.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కంటి పరీక్షలు చేసిన విద్యార్థుల సంఖ్య: 3,69,371
కంటి అద్దాలకు రిఫర్ చేసిన వారి సంఖ్య: 12,089
కంటి శుక్లాలు ఉన్న విద్యార్థులు: 14
మెల్లకన్ను శస్త్ర చికిత్సలు : 10
Comments
Please login to add a commentAdd a comment