![YS Jagan government will distribute agricultural lands - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/6/land.jpg.webp?itok=gm_eHzX9)
సాక్షి, అమరావతి: సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో నిరుపేదలకు వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ భూములు పంపిణీ చేయనుంది. 23 జిల్లాల్లో 54 వేల ఎకరాలను అర్హులైన పేదలకు పంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో అర్హులైన సుమారు 47 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేసింది. ఆయా జిల్లాల అసైన్‌మెంట్ కమిటీల ఆమోదం కూడా దాదాపు పూర్తయింది. భూమి లభ్యతను బట్టి ఒక్కో లబ్ధిదారునికి ఒకటి నుంచి ఒకటిన్నర ఎకరం వరకు భూమి ఇవ్వనున్నారు.
గ్రామాల్లో నిరుపేదలకు వ్యవసాయ భూములు ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ఏడాది కిందటే కసరత్తు మొదలుపెట్టారు. అన్ని జిల్లాల్లో పేదలకు ఇవ్వడానికి అందుబాటులో ఉన్న భూమి, అర్హులైన లబ్దిదారుల వివరాలతో నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ల పరిశీలన తర్వాత 23 జిల్లాల్లోనే భూమి అందుబాటులో ఉన్నట్లు తేలింది. వైఎస్సార్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఆశాజనకంగా భూమి అందుబాటులో ఉండగా, మరో 8 జిల్లాల్లో వెయ్యి నుంచి 4 వేల ఎకరాల లోపు భూమి లభ్యత ఉన్నట్లు నిర్ధారణ అయింది.
మరో 9 జిల్లాల్లో వెయ్యి నుంచి 2 వేల ఎకరాల భూమి ఉండగా, 4 జిల్లాల్లో వెయ్యి ఎకరాల లోపు భూమి అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్లు నివేదికలు ఇచ్చారు. విశాఖ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో భూమి అందుబాటులో లేదు. దీంతో భూమి లభ్యత ఉన్న 23 జిల్లాల్లో గుర్తించిన భూమిని సర్వే చేసి, డిమార్కేషన్ చేయించారు. అసైన్‌మెంట్ కమిటీల అనుమతులు కూడా లభించాయి. త్వరలో మంత్రివర్గం భూ పంపిణీకి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
వైఎస్సార్ జిల్లాలో 8,916 ఎకరాలు
అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో 8,916 ఎకరాలను పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత శ్రీ సత్యసాయి జిల్లాలో 7,476, కర్నూలు 4,092, నంద్యాల 3,678, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 3,711, కాకినాడ 2,935, చిత్తూరు 2,866, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2,565 ఎకరాలను పంపిణీ చేయనున్నారు. భూ పంపిణీలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూసేందుకు ఇళ్ల పట్టాల పంపిణీ మాదిరిగా ఆన్‌లైన్ సేవా యాప్‌ను వినియోగించనున్నారు.
ఈ యాప్ ద్వారానే అర్హులకు పట్టాలు జెనరేట్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తొలుత లబ్దిదారుల పేర్లను వెబ్‌ల్యాండ్‌లో మ్యుటేషన్ చేస్తారు. భూ పంపిణీ కోసం ప్రత్యేకంగా మ్యుటేషన్ చేసే అధికారాన్ని ఆర్డీఓలకు ఇచ్చారు. మామూలుగా అయితే ఈ లాగిన్ జేసీల వద్ద ఉంటుంది. ఆర్డీఓలు మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేశాక, ఆ వివరాల ఆధారంగా వీఆర్‌ఓలు తమ గ్రామాల పరిధిలోని లబ్దిదారుల వ్యక్తిగత వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు.
చివరిగా అవి తహశీల్దార్ లాగిన్‌లోకి వెళ్లాక ఆయన పరిశీలించి అనుమతిస్తారు. అప్పుడు లబ్ధిదారుని పేరుపై వ్యవసాయ భూమి పట్టా జెనరేట్ అవుతుంది. దీంతో లబ్దిదారుల వివరాలన్నీ వెబ్‌ల్యాండ్‌లో, ఆన్‌లైన్ యాప్‌లోనూ ఉంటాయి. వాటిని మార్చడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
2013లో చివరి సారిగా భూ పంపిణీ
రాష్ట్రంలో చివరిసారిగా 2013లో భూ పంపిణీ జరిగింది. తక్కువ భూమి అయినా పేదలకివ్వడం అదే చివరిసారి. ఆ తర్వాత భూ పంపిణీ గురించి ఎవరూ పట్టించుకోలేదు. పేదలు మాత్రం తమ జీవనోపాధికి కొంత భూమి ఇవ్వాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతూనే ఉన్నారు. అలాంటి దరఖాస్తులు తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్లలో ఎప్పటి నుంచో మూలనపడి ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎవరూ అడగకుండానే నిరుపేదలకు మేలు చేయాలనే సంకల్పంతో భూ పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు.
పేదల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది. కూలినాలి చేసుకుని కష్టంగా బతుకు బండి లాగుతున్న వారిని, కౌలుకు తీసుకుని ఆరుగాలం శ్రమిస్తున్న వారిని భూ యజమానులుగా చేయనుంది. తద్వారా ‘ఈ భూమి మాదే’ అని అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు గర్వంగా చెప్పుకునేలా చేయాలని తాపత్రయ పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 54 వేల ఎకరాల భూ పంపిణీకి వేగంగా చర్యలు తీసుకుంటోంది.
పట్టాపైనే పూర్తి వివరాల నమోదు
పట్టాలపై గతంలో మాదిరి కాకుండా లబ్దిదారుని పూర్తి వివరాలు నమోదు చేయనున్నారు. వీటితోపాటు భూమికి సంబంధించిన సర్వే నంబర్ (లేదా ఎల్‌పీఎం నంబర్), విస్తీర్ణం, ఖాతా నంబర్, భూమి స్వభావాన్ని కూడా ముద్రించనున్నారు.
సర్వే నంబరు వారీగా భూమిని గుణించి మొత్తం విస్తీర్ణాన్ని పట్టాపై కనిపించేలా ఏర్పాటు చేస్తున్నారు. పట్టాపై లబ్దిదారుడు, భూమికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయడం వల్ల ఆ భూమిని భవిష్యత్తులో మరొకరికి బదలాయించే అవకాశం ఉండదని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. ఆధార్ నంబర్ కూడా పట్టాపై నమోదు చేయడం ద్వారా మరోసారి భూమి కోసం సంబంధిత లబ్ధిదారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment