ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
ప్రభుత్వం వల్లే మా కుటుంబం బాగుంది
మాది వ్యవసాయ కుటుంబం. మేడి పడితే గానీ మా కడుపు నిండదు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం, కోటపోలూరు గ్రామంలో మాకున్న పొలంలోనే కొడుకు, కోడలు వ్యవసాయం చేస్తుండేవారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయంపై ఎటువంటి సహాయం అందలేదు. అప్పు చేసి వ్యవసాయం చేశాం. వాటిని తీర్చలేక నానా కష్టాలు పడ్డాం. ఇక నష్టాన్ని భరించలేక ఉన్న వ్యవసాయ భూమిని అమ్ముకుని వెళ్లాలనుకున్నాం. కొంత కాలం సాగు నిలిపివేశాం. మా అదృష్టం కొద్దీ వైఎస్సార్‌పీసీ ప్రభుత్వం వచ్చింది. వారి దయవల్ల మళ్లీ వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయి. రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి రూ. 13,500 వంతున వచ్చింది. దాంతో 1.7 ఎకరాల్లో మళ్లీ వ్యవసాయం చేస్తున్నాం. పరిస్థితులు అనుకూలించడంతో గతంలో చేసిన అప్పులన్నీ తీర్చేశాం.
ఇంతలో నాకు శ్వాస కోస సంబంధిత వ్యాధి రావడంతో.. ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. చికిత్స చేసే స్తోమత లేక సతమతమయ్యాం. ఇంతలో వలంటీర్ ఇంటికి వచ్చి ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్పింది. వెంటనే నెల్లూరులో ఆపరేషన్ చేసుకున్నాను. రూ. 50వేలు ప్రభుత్వ సహాయం అందింది. నాకు ప్రతి నెలా పింఛన్ అందుతోంది. నా మనవరాలు చెంచు ప్రియకు అమ్మఒడి కింద ఏడాదికి రూ. 15వేలు వస్తోంది. పాఠశాలలో ఆనందంగా చదువుతోంది. పొదుపు ద్వారా నా కోడలు హైమావతి రూ.60 వేల రుణం తీసుకుని 2 బర్రెలను కొనుక్కుని నెలకు రూ.10వేల వరకు సంపాదిస్తోంది. స్త్రీనిధి ద్వారా మరో రూ.50 వేలు పొదుపు రుణం అందింది. వైఎస్సార్ ఆసరా కింద రూ.14వేలు వరకు వచ్చింది. నాకే కాకుండా మా కుటుంబానికి కూడా ప్రభుత్వం అండగా నిలిచింది.
– గుమ్మడి కస్తూరమ్మ, కోటపోలూరు(మహమ్మద్ నాజీం, విలేకరి, సూళ్లూరుపేట రూరల్)
సంక్షేమానికి జై‘కొట్టు’
నేను, మా ఆయన గతంలో చిన్నపాటి పనులు చేసుకుని జీవనం సాగించేవాళ్లం. ఆ వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం. ఎంతో కష్టమ్మీద పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశాం. వారిద్దరూ వేరేగా కాపురం ఉంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో ఉంటున్న నేను మహిళా సంఘ సభ్యురాలిగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఎలాంటి మేలు జరగలేదు. పైగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన నకిలీ హామీల కారణంగా చేసిన అప్పులు తీర్చకపోవడంతో ఆ వడ్డీకాస్తా ఎక్కువై మరింత ఆర్థికంగా కుదేలయ్యాం. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటివరకూ రూ.60 వేలు వచ్చాయి. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750లు వంతున వచ్చింది. ఆ మొత్తంతో మా గ్రామంలో బడ్డీ కొట్టు పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాం. ఇప్పుడు మాకు ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయాయి. హాయిగా కుటుంబం గడుస్తోంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మా కుటుంబం రుణపడి ఉంటుంది.
– నెరుసు కుసుమ, తడికెలపూడి(యు.లక్ష్మీనారాయణ, విలేకరి, కామవరపుకోట)
కూలిపని మాని వ్యాపారం చేసుకుంటున్నా..
నేను, నా భర్త గతంలో కూలిపనులు చేసేవాళ్లం. రోజువారీ వచ్చే డబ్బులతోనే జీవనం గడిచేది. పనులు లేనప్పుడు అప్పులు చేయక తప్పేది కాదు. ఏదైనా సొంతంగా వ్యాపారం చేసుకుందామని అనుకున్నా అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. కానీ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగనన్న పాలనలో మహిళలకు అన్ని విధాల బాగుంది. సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, ఆసరా, స్త్రీనిధి పథకాలు మహిళలకు వరంగా మారాయి. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల పంచాయతీ పుట్లూరువారి పల్లె గ్రామ సంఘంలో సభ్యురాలుగా ఉన్న నాకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ. 18,750లు వంతున, వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటివరకూ రూ.70 వేలు వచ్చింది.
ఆ మొత్తానికి బ్యాంక్ ద్వారా తీసుకున్న లోన్ రూ.2 లక్షలు కలిపి కొనకనమిట్ల బస్టాండ్ సెంటర్లో భర్త వెంకటేశ్వర్లుతో కలిపి కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు కూలి పనులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గౌరవంగా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాం. అమ్మ ఒడి పథకం అందడంతో పిల్లల చదువుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. మేము ఈ పరిస్థితికి రావడానికి కారణమైన జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
– శిగినం ఆదెమ్మ, పుట్లూరివారిపల్లి (నాగం వెంకటేశ్వర్లు, విలేకరి, కొనకనమిట్ల మండలం)
Comments
Please login to add a commentAdd a comment