
బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లి వద్ద నిర్మాణంలో ఉన్న జగనన్న ఇళ్లు
జిల్లాలో ప్రతిష్టాత్మకంగా సకల సౌకర్యాలతో జగనన్న ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో పేదలకు ఇంటి స్థలాలు నివాస యోగ్యం కాని కొండలు, గుట్టల ప్రాంతాల్లో ఇచ్చే వారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశాలమైన రోడ్లు, పార్కులు, పాఠశాలలు, ఆస్పత్రులు, ఇతర సామాజిక అవసరాల కోసం స్థలాలు కేటాయించి.. అభివృద్ధి పరిచిన ప్లాట్లలో స్థలాలు ఇచ్చింది. పేదల కోసం కట్టిన ఇళ్లు చూస్తే అవి బలహీన వర్గాల ఇళ్లని తెలిసి పోయేవి. జగనన్న కాలనీల్లో ఇళ్లు పేదల పొదరిల్లు తలపిస్తున్నాయి. ఏకంగా ఊళ్లే ఆవిష్కృతమవుతున్నాయి.
నెల్లూరు (అర్బన్): వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదలందరికీ పక్కా ఇళ్లు పథకం ద్వారా నిర్మితమవుతున్న కలల సౌధాలతో కొత్త ఊళ్లు వెలుస్తున్నాయి. జిల్లాలో తొలిదశలో సకల సౌకర్యాలతో 282 లేఅవుట్‌లు నిర్మించారు. 58,070 ఇళ్లు మంజూరు అయ్యాయి. అయితే లేఅవుట్ల స్థలాలపై కొంత మంది కోర్టులకు వెళ్లడం, నవంబర్ నుంచి జనవరి వరకు భారీ వర్షాలు కురవడం, వరదలు రావడం వల్ల ఇళ్ల నిర్మాణాలకు కొంత అంతరాయం కలిగింది. ప్రస్తుతం కోర్టు కేసులు తొలగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారులు దగ్గరుండి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు సాయపడుతున్నారు.
జగనన్న లే అవుట్లలో పూర్తి సౌకర్యాలు
టీడీపీ పాలనలో సొంత నివేశన స్థలం ఉన్న వారికే ఇళ్లు మంజూరు చేసేది. ప్రజలకు ఎక్కడా నివేశన స్థలాలు ఇచ్చిన పాపాన పోలేదు. అయితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థలం మంజూరుతో పాటు ఇంటిని కూడా మంజూరు చేసింది. ఇందు కోసం లే అవుట్లను ఏర్పాటు చేశారు. లే అవుట్‌లంటే సాదా.. సీదాగా కాకుండా అక్కడ సకల సౌకర్యాలు కల్పించారు. చెట్టూ, పుట్టా తొలగించి భవిష్యత్ అవసరాల కోసం బడి, గుడి వంటి వాటి కోసం కొంత రిజర్వు స్థలాన్ని సిద్ధం చేశారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కరెంట్ సౌకర్యం కల్పించారు. తాగునీటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా పైపులైన్లు ఏర్పాటు చేశారు. రోడ్లకిరువైపులా మొక్కలు నాటి జగనన్న కాలనీలు (లేఅవుట్‌లు)ను అందంగా తీర్చిదిద్దారు.
రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల ఆస్తి సొంతం
జిల్లాలో 282 లేఅవుట్లకు సంబంధించి మొత్తం రూ.1,320 కోట్ల ఆస్తిని ప్రజలకు జగనన్న ఇళ్ల రూపంలో అందిస్తున్నారు. ప్రభుత్వం నివేశన స్థలం ఇవ్వడమే కాకుండా అక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో ఆ స్థలానికి డిమాండ్ పెరిగింది. నెల్లూరు నగరం, కోవూరు కావలి, ఆత్మకూరు, కందుకూరు తదితర పట్టణాల్లో ఏర్పాటు చేసిన స్థలం, ఇంటి నిర్మాణం విలువ కలుపుకుంటే రూ.15 లక్షల ఆస్తి లబ్ధిదారుడి సొంతమవుతోంది. పట్టణాలకు కొంచెం దూరంగా ఉన్న చోట జగనన్న ఇంటి విలువ రూ.10 లక్షల వరకు లబ్ధిదారుడికి సొంతమవుతోంది.
కోవూరు సమీపంలో నిర్మాణం పూర్తయిన ఇల్లు
లబ్ధిదారుల ఖాతాల్లో రూ.223 కోట్లు జమ
ఇప్పటి వరకు లబ్ధిదారులు పూర్తి చేసిన నిర్మాణాలకు రూ.228 కోట్లు బిల్లులు రావాల్సి ఉండగా రూ.223 కోట్లు చెల్లించారు. ఆప్షన్ 3 కింద లబ్ధిదారుల ప్రమేయం లేకుండా కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణాలు చేపట్టే దగ్గర కొంత మంది బ్యాంకు ఖాతాలు తెరవకపోవడంతో మరో రూ.5 కోట్లు మాత్రమే జమ కావాల్సి ఉంది. ఇంటి నిర్మాణాలకు పొదుపు మహిళలకు మెప్మా, డీఆర్‌డీఏల ద్వారా రూ.35 వేలు బ్యాంకు రుణాలు అందిస్తున్నారు. ఇంటి నిర్మాణాలకు ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ ఇవ్వడంతో సుమారుగా అదనంగా రూ.44 వేల లబ్ధి చేకూరుతోంది. దీంతో లబ్ధిదారుడి కష్టం, ప్రభుత్వ సాయంతో ఇళ్లను వడి వడిగా పూర్తి చేసుకుంటున్నారు.
సొంతింటి కల తీరనుంది
నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను. సొంతిల్లు లేదు. ఎన్నో ఏళ్లుగా స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటున్నప్పటికీ గత ప్రభుత్వాలు నాకు స్థలం ఇవ్వలేదు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం ఇంటి స్థలం పట్టా ఇవ్వడమే కాకుండా, ఇంటిని సైతం మంజూరు చేశారు. నిర్మాణం పూర్తి కావస్తోంది. సొంతిల్లు కల నెరవేరబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
– ప్రమీల, పండ్ల వ్యాపారి, గాంధీ గిరిజన సంఘం
వేగంగా ఇళ్లు పూర్తి చేస్తున్నాం
ప్రస్తుతం కోర్టు అడ్డంకులు తొలగిపోయాయి. జూన్, జూలై నెలల్లోనే వేగంగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తాం. లబ్ధిదారుల ఖాతాల్లో వారం, వారం బిల్లులు జమ అవుతున్నాయి. బిల్లులు పెండింగ్ లేవు. దీంతో లబ్ధిదారులు మరింత ఉత్సాహంగా ఇంటి నిర్మాణం చేస్తున్నారు.
– నరసింహం, ప్రాజెక్టు డైరెక్టర్, హౌసింగ్ కార్పొరేషన్
Comments
Please login to add a commentAdd a comment