Vizianagaram: భూముల రీసర్వేలో కొత్త అంకం ప్రారంభం | YSR Jagananna Saswatha Bhu Hakku Bhu Raksha Scheme in Vizianagaram | Sakshi
Sakshi News home page

Vizianagaram: భూముల రీసర్వేలో కొత్త అంకం ప్రారంభం

Published Tue, Nov 22 2022 8:05 PM | Last Updated on Tue, Nov 22 2022 8:05 PM

YSR Jagananna Saswatha Bhu Hakku Bhu Raksha Scheme in Vizianagaram - Sakshi

బొబ్బిలి: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష కార్యక్రమం కింద విజయనగరం జిల్లాలో జోరుగా సాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియలో కొత్త అంకానికి జిల్లా అధికార యంత్రాంగం తెరతీసింది. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ నెలాఖరులోగా భూహక్కు పత్రాల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. పాస్‌ పుస్తకాలను ఇప్పటికే రెవెన్యూ డివిజనల్‌ కేంద్రాలకు సరఫరా చేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు వీటిని రైతులకు అందజేయనుంది.  


సర్వే ఇలా...  

జిల్లాలో 983 గ్రామాల్లోని భూములను రీసర్వే చేయాల్సి ఉంది. తొలుత రామభద్రపురం మండలం మర్రి వలసలో సర్వే ప్రక్రియను పాలకులు ప్రారంభించారు. అధునాతన పరికరాలతో డ్రోన్‌ సర్వే చేపట్టి, తరువాత క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, సర్వే సిబ్బంది హద్దులు నిర్ణయిస్తున్నారు. రైతుల సమక్షంలో వివాదాలు లేకుండా సర్వే పూర్తిచేస్తున్నారు. విస్తీర్ణంను పక్కాగా నిర్ధారిస్తున్నారు. గ్రామ సభల్లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి భూముల వివరాలను స్కానింగ్, కంప్యూటరైజ్డ్‌ చేస్తున్నారు.  

179 గ్రామాల్లో సర్వే పూర్తి...  
జిల్లాలోని 4.84 లక్షల చదరపు కిమీల పరిధిలో రీసర్వే చేయాల్సి ఉంది. నేటి వరకు సర్వే, రెవెన్యూ అధికారులు 179 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారు. అందులో దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో రీసర్వే పూర్తయింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం తదితర డివిజన్లలో ఒక్కో డివిజన్‌లో ఐదేసి గ్రామాల చొప్పున ముందుగా జగనన్న భూ హక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు అధికారు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ మేరకు ఆయా డివిజన్లకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేసింది.  

వివాదాలకు తావులేకుండా...  
జగనన్న సంపూర్ణ భూ హక్కు పత్రాల్లో క్యూర్‌ కోడ్, మ్యాపుల ఫొటోలు, విస్తీర్ణం, సర్వే నంబర్లతో సహా అన్ని వివరాలూ ముద్రించారు. క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే రైతు తమ భూముల సమస్త వివరాలనూ తెలుసుకోవచ్చు. భూ యజమాని, రైతులకు సంబంధించిన అన్ని వివరాలూ ఇందులో ఉన్నాయి. రైతులు, యజమానులు ఎటువంటి ఆందోళన, సందేహాలకు గురికానవసరం లేదు. అన్ని వివరాలతో ఉన్న హక్కు పత్రాలను పొందేలా అధికారులు ఈ హక్కు పత్రాలను సిద్ధం చేశారు. విడతల వారీగా రైతులకు ఈ పత్రాలు అందజేయనున్నారు.  

పొరపాట్లు దొర్లితే మ్యుటేషన్‌కు అవకాశం..  
అత్యధిక గ్రామాల్లో ఒకే సారి హద్దుల గుర్తింపు, విస్తీర్ణం, రీసర్వే ప్రాంతాలు ఒకే సారి చేపట్టడం వల్ల ఎక్కడైనా చిన్న తప్పులు దొర్లితే దానిని మ్యుటేషన్‌ ద్వారా సరిదిద్దుకోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. భూముల రీ సర్వేలో 480 సర్వే సిబ్బంది నిమగ్నమయ్యారు.   

త్వరలోనే పంపిణీ చేస్తాం  
రీసర్వేకు సంబంధించిన ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్న గ్రామాల భూ హక్కు పత్రాలు ముద్రించి కార్యాలయానికి వచ్చాయి. అన్ని డివిజన్‌ కార్యాలయాలకూ ఈ హక్కు పత్రాలు వెళ్లాయి. ఉన్నతాధికారులు తేదీ నిర్ణయిస్తే వాటిని రైతులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం.  
– పి.శేషశైలజ, ఆర్డీఓ, బొబ్బిలి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement