
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు పేదలైన తల్లిదండ్రులకు భారం కాకూడదన్న లక్ష్యంతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ‘వైఎస్సార్ కల్యాణమస్తు’, ‘వైఎస్సార్ షాదీ తోఫా’ పథకాల ఆర్థిక సాయం నేడు లబ్ధిదారులకు అందనుంది.
ఈ పథకాల కింద రాష్ట్రంలోని అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, విభిన్న ప్రతిభావంతులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కల్యాణమస్తు, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది.
2022 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య త్రైమాసికంలో వివాహం చేసుకున్న వారికి వీటి ద్వారా లబ్ధి చేకూర్చనుంది. పేదింటి ఆడబిడ్డలను చదువులో ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడం, విద్యా సంస్థల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్ రేట్ తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోంది.
ఇందులో భాగంగానే వివాహం చేసుకునే వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి చేసింది. లంచాలు, వివక్షతకు తావులేకుండా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తోంది. ఈ పథకం సాయాన్ని ప్రతి మూడు నెలలకు లబ్ధిదారులకు అందిస్తుంది. వివాహమైనవారు 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment