సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్రంలో అన్నదాతలకు అడుగడుగునా చేయూతనిస్తూ వారికి అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చోట వారి పక్షాన న్యాయపోరాటం కూడా చేస్తోంది. దశాబ్దాల తరబడి సాగుచేసుకుంటున్న భూమిని ‘పచ్చ’గద్దలు ఎగరేసుకు పోవడానికి చేస్తున్న కుట్రలను ఎదిరించి రైతులు రోడ్డెక్కడంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి బాసటగా నిలిచింది. ‘పచ్చ’నేత భూదందాలో అన్యాయమైపోతున్న రైతన్నల పక్షాన పోరాటానికి నడుం బిగించింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు సాగించిన ఈ భూబాగోతం కథాకమామిషు ఏమిటంటే..
యు.కొత్తపల్లి మండలం యండపల్లిలో రూ.50కోట్లు విలువచేసే 52 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోని చెరువు గర్భం ఉంది. సర్వే నంబరు 627–1, 2, 628–1, 2 పాత, కొత్త చెరువులలో ఇది సాగు భూమిగా ఉంది. వీటిని ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఆరు గ్రామాలకు చెందిన 300 మంది నిరుపేద రైతులు సాగుచేసుకుంటున్నారు. 20 సెంట్ల నుంచి అర ఎకరం వరకు వీరికి ఉంది. 50 ఏళ్లుగా పన్నులు చెల్లిస్తున్న రశీదులు కూడా ఉన్నాయి.
తమ ఆడ పిల్లలకు ఆ భూములను కట్న కానుకలుగా ఇచ్చుకున్న రైతులూ ఉన్నారు. ఈ నేపథ్యంలో.. రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడం.. ఇక్కడ ఎకరం రూ.కోటి పలుకుతుండడంతో గత ప్రభుత్వ హయాంలో సదరు టీడీపీ ప్రజాప్రతినిధి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ భూమిపై కన్నేశాడు. నిరుపేదలు సాగులో ఉన్న భూమిని అప్పనంగా కొట్టేయాలని ఆయన, అతని అనుచరులు స్కెచ్ వేశారు. అంతే.. 2016–17, 2018–19 మధ్య ఆయన రెవెన్యూ రికార్డులను తారుమారు చేయించారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.50కోట్లు విలువచేసే 52 ఎకరాలకు హక్కుదారు అంటూ ఆర్‌విఎస్ రావు అనే వ్యక్తిని తెరమీదకు తీసుకొచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 2017–18లో అతని పేరుతో రికార్డులు సృష్టించారు. పాస్ పుస్తకాలు కూడా పుట్టించారు.
రైతులకు తోడుగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆందోళన
ఇక ఈ నకిలీ రికార్డుల ఆధారంగా రైతులను ఖాళీ చేయించేందుకు ఆ మాజీ ప్రజాప్రతినిధి తెర వెనుక పెద్ద ప్రయత్నమే చేశారు. అంతేకాక.. రైతులకు పంట దక్కకుండా నేలపాలు చేశారు. అంతటితో ఆగక పెంచిన మొక్కలనూ నరికేశారు. ఇలా గత సెప్టెంబర్‌లో వారిని బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో రైతులు రోడ్డెక్కారు.
వీరికి సంఘీభావంగా అక్కడ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. అదే సమయంలో రెండో విడత ‘కాపు నేస్తం’ కార్యక్రమం కోసం కాకినాడ జిల్లా గొల్లప్రోలు వచ్చిన సీఎం వైఎస్ జగన్ దృష్టికి ఎమ్మెల్యే ఈ సమస్యను తీసుకెళ్లారు. దీంతో రైతుల పక్షాన న్యాయ పోరాటం చేయాలని ప్రభుత్వం అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసింది. దీంతో అధికారులు హైకోర్టులో కౌంటర్ చేశారు.
రైతుల చేతికొచ్చేవరకు పోరాటం చేస్తాం
ఎన్నో ఏళ్లుగా నిరుపేద రైతులు సాగుచేసుకుంటున్న భూములను తిరిగి వారి చేతికి వచ్చేవరకు పోరాటం చేస్తాం. రైతులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.
– పెండెం దొరబాబు, ఎమ్మెల్యే, పిఠాపురం
రైతుల పక్షాన కౌంటర్ వేశాం
యండపల్లిలో 52 ఎకరాల భూ సమస్యను పరిశీలించాం. అందులో రైతుల పక్షాన జిల్లా యంత్రాంగం న్యాయ పోరాటం చేస్తోంది. హైకోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేశాం.
– కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్, కాకినాడ
తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నాం
మా తాతల కాలం నుంచి చెరువు భూమిని సాగుచేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నాం. ప్రాణాలను అడ్డుపెట్టి అయినా భూమిని కాపాడుకుంటాం.
– చింతపల్లి తాతిరెడ్డి, రైతు, కొత్త ఇసుకపల్లి
ఒక్క రూపాయి నుంచి పన్ను కడుతున్నాం
మేం సాగు చేసుకుంటున్న ఈ భూ మికి మా తాతలు రూపాయి దగ్గ ర్నుండి పన్ను చెల్లిస్తూ వస్తు న్నారు. ఇప్పుడు భూమి మాది కాదని చెబుతున్నారు. సీఎం జగన్ మమ్మల్ని ఆదుకోవాలి. – తమిలిశెట్టి సుబ్బారెడ్డి, రైతు కొత్త ఇసుకపల్లి
Comments
Please login to add a commentAdd a comment