సాక్షి, అమరావతి: ఓట్లు దండుకుని మొహం చాటేసిన మనుషులనే ఇన్నాళ్లూ చూశాం! ఎన్నికలు ముగియగానే మేనిఫెస్టోను మాయం చేసి చెత్తబుట్ట పాలు చేసిన పార్టీల గురించే మాకు తెలుసు! అధికారం చేపట్టాక ప్రజా సమస్యలను గాలికి వదిలేసి గ్రామాల వైపు తిరిగి చూడని నేతల పాలనలో దశాబ్దాల పాటు నలిగిపోయాం! మళ్లీ ఎన్నికలు వస్తే గానీ మా గుమ్మం తొక్కని నాయకులతో విసిగిపోయాం! అలాంటిది.. చరిత్రలో తొలిసారిగా 99 శాతం హామీలను నెరవేర్చి చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతో మా గుమ్మం వద్దకు వస్తున్న ప్రజా ప్రతినిధులను ఇప్పుడే చూస్తున్నాం..! ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? ఇంకా ఏమైనా సమస్యలున్నాయా?.. ఆశీర్వదించండంటూ ఆత్మీయంగా గడప గడపనూ పలుకరిస్తున్న నాయకులను చూడటం ఇదే మొదటిసారి అని రాష్ట్ర ప్రజానీకం పేర్కొంటోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంతో ప్రతి గడప పులకరిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఈ నెల 20వతేదీ నాటికి ఎమ్మెల్యేలు 83,83,908 గృహాలను సందర్శించారు. ఆయా కుటుంబాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేకూర్చిన ప్రయోజనాలను వివరించి వారి ఆశీర్వాదాలను పొందారు. రాష్ట్రంలోని మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకుగానూ ఇప్పటివరకు ఎమ్మెల్యేలు 9,316 సచివాలయాలను సందర్శించారు.
గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా సచివాలయాల వారీగా పర్యటిస్తూ ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజలను కలుసుకుంటున్న ఎమ్మెల్యేలు ఆయా కుటుంబాలకు ప్రభుత్వం చేకూర్చిన మేలును వివరిస్తూ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? అని ఆరా తీస్తూ ఆయా కుటుంబాలతో టిక్ పెట్టిస్తున్నారు.
ప్రాధాన్యత పనులను గుర్తించి నిధులు
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం మేర వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది. నవరత్నాల్లో భాగంగా కులమతాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ పారదర్శకంగా, సంతృప్త స్థాయిలో ప్రయోజనాలను అందించింది. ఏటా సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి ఆయా పథకాల కింద లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేస్తోంది. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులంతా ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజలను కలుసుకునేలా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గతేడాది మే 11వ తేదీన ప్రారంభించింది.
ఆయా కుటుంబాలకు ప్రభుత్వం చేకూర్చిన ప్రయోజనాలను వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖలను అందజేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే సచివాలయాల పరిధిలో రెండు రోజుల పాటు పర్యటించడంతో పాటు స్థానికంగా ప్రజలకు అవసరమైన, ప్రాధాన్యత కలిగిన పనులను గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మంజూరు చేస్తున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో రూ.20 లక్షల చొప్పున అత్యంత ప్రాధాన్యత పనులను గుర్తించి వెంటనే మంజూరు చేస్తున్నారు.
సచివాలయాలవారీగా నివేదికలు సిద్ధం
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ నెల 20వతేదీ వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు పాల్గొన్నారనే వివరాలతో సచివాలయాలవారీగా నివేదికను ప్రణాళికా శాఖ రూపొందించింది. ఇప్పటి వరకు ఎన్ని గృహాలను సందర్శించారు? సచివాలయాల వారీగా ఎన్ని ప్రాధాన్యత పనులను గుర్తించారు? ఎన్ని పనులకు నిధులు మంజూరు చేశారు? ఎన్ని ప్రారంభమయ్యాయి? ఎన్ని పనులు పూర్తి చేశారు? తదితర వివరాలను నివేదికలో పొందుపరిచారు.
సచివాలయాల్లో ఎన్ని రోజులు? (ఈనెల 20 వరకు)
► ఒక్కో సచివాలయంలో ఒక రోజు గడిపిన ఎమ్మెల్యేలు 9 మంది
► ఒక్కో సచివాలయంలో రెండేసి రోజులు గడిపిన ఎమ్మెల్యేలు 85 మంది
► ఒక్కో సచివాలయంలో మూడు రోజులు గడిపిన ఎమ్మెల్యేలు 46 మంది
► ఒక్కో సచివాలయంలో మూడు రోజులకు పైగా గడిపిన ఎమ్మెల్యేలు 11 మంది
ఎంత మంది.. ఎన్ని రోజులు వెళ్లారు? (ఈ నెల 20 వరకు)
► 150 రోజులకు పైగా గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 40 మంది
► 121 – 150 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 43 మంది
► 91 – 120 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 38 మంది
► 61 – 90 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 18 మంది
► 31 – 60 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 11 మంది
► 1 – 30 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యే 1
గడప గడపకూ ప్రాధాన్యత పనులు ఇలా (ఈనెల 20 వరకు)
► రూ.1,454.30 కోట్ల విలువైన 37,725 ప్రాధాన్యత పనులు అప్‌లోడ్
► రూ.1,342.68 కోట్ల విలువైన 34,767 పనులు మంజూరు
► రూ.1,179.06 కోట్ల విలువైన 31,346 పనులు ప్రారంభం
► రూ.251.22 కోట్ల విలువైన 6,554 పనులు పూర్తి
Comments
Please login to add a commentAdd a comment