చంద్రబాబు.. సీఎంగా అర్హుడివేనా?: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan fires on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. సీఎంగా అర్హుడివేనా?: వైఎస్‌ జగన్‌

Published Thu, Sep 5 2024 5:07 AM | Last Updated on Thu, Sep 5 2024 8:20 AM

YSRCP President YS Jagan fires on Chandrababu Naidu

చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

విజయవాడ విపత్తుకు ముమ్మాటికి తప్పు బాబుదే  

వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే 

వరదలకు ఇప్పటికే 32 మంది బలి 

ఇంకా ఎందరు చనిపోయారో లెక్క తెలియడం లేదు 

సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలం 

బాబు అసమర్థతకు అధికారులను బలి పశువులను చేస్తారా?

చంద్రబాబు తన ఇంటి కోసమే విజయవాడను ముంచారు 

ఆ ఇల్లు కూడా మునగడంతో కలెక్టర్‌ ఆఫీస్‌లో మకాం 

ప్రజల కోసమే తానక్కడ ఉంటున్నట్లు విపరీతంగా పబ్లిసిటీ 

ఏ విపత్తు వ చ్చినా నాడు కొండంత అండలా వలంటీర్ల సేవలు

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున అందించాలి

సామాన్లు కోల్పోయిన ప్రతి ఇంటికీ రూ.50 వేలు ఇవ్వాలి

‘‘బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్‌ ఉంది. వెలగలేరు రెగ్యులేటర్‌ మీద లాక్‌లు.. అంటే గేట్లను శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడు ఎత్తాడు? ఎందుకు ఎత్తాడు? అది ఎత్తకపోయి ఉంటే చంద్రబాబు ఇల్లు మునిగేది. ఎందుకంటే ఆ నీళ్లు తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లేవి. బాబు ఇల్లు మునిగేది. ఎందుకంటే.. అక్కడి నుంచి నీళ్లు డైవర్షన్‌ చానల్‌ ద్వారా పోలవరం కెనాల్‌లో చేరి అక్కణ్నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో కలిసేవి. దానివల్ల బ్యాక్‌వాటర్‌ ఎక్కువై చంద్రబాబు ఇల్లు మునిగేది. 

మరి ఆ రెగ్యులేటర్‌ 11 గేట్లు ఒకేసారి ఎత్తింది ఎవరు? అర్ధరాత్రి పూట హడావుడిగా ఎందుకు ఎత్తారు? ఎక్కడ చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందేమోనని ఎత్తారు. అలా ఎత్తడం వల్ల ఆ గేట్ల నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున వ చ్చిన నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి? విజయవాడకే వస్తాయి. విజయవాడను ముంచెత్తింది బుడమేరు జలాలే’’   – వైఎస్‌ జగన్‌


సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి పదవిలో కూర్చో­వడానికి అసలు అర్హుడివేనా? అని ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలని చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడ విపత్తుకు ముమ్మాటికీ చంద్రబాబు తప్పిదమే కారణమని పునరుద్ఘాటించారు. చేసిన తప్పులకు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

విజయవాడ వరదలకు ఇప్పటికే 32 మంది బలి అయ్యారని.. ఇంకెందరు చనిపోయారో లెక్క తెలియడం లేదని.. ఆ మరణాలకు పూర్తి బాధ్యత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. వరద సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో తప్పులు కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు ఆ నెపాన్ని అధికారులపై నెడుతున్నారని మండిపడ్డారు. నిజానికి అన్ని అనర్ధాలకు కారణం చంద్రబాబే అని తేల్చిచెప్పారు. 

బుధవారం విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో మోకాలి లోతు నీళ్లలో వైఎస్‌ జగన్‌ నడుచుకుంటూ వెళ్లి వరద బాధితులను నేరుగా కలుసుకున్నారు. వారి కష్టాలను విని చలించిపోయారు. తిండి, నీరు లేక మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న నాథుడు లేడని, ఎక్కడికైనా వెళ్లిపోదామంటే కనీసం బోట్లు కూడా ఏర్పాటు చేయలేదని బాధితులు వైఎస్‌ జగన్‌ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఆ బాధలు తెలుసుకుని వారిని ఓదార్చి నేనున్నానంటూ వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. 

ముమ్మాటికీ బాబు తప్పిదం వల్లే.. 
తాను నివాసం ఉంటున్న కరకట్ట అక్రమ నివాసాన్ని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు విజయవాడను ముంచారు. చివరకు ఆ ఇల్లు కూడా నీట మునగడంతో కలెక్టర్‌ ఆఫీస్‌కు మకాం మార్చారు. ప్రజల కోసమే తానక్కడ ఉంటున్నట్లు ప్రచారం చేసుకుంటూ మందీ మార్బలంతో వరద పీడిత ప్రాంతాల్లో హంగామా చేస్తున్నారు. విజయవాడలో విపత్తు కచ్చితంగా మానవ తప్పిదం వల్లే వ చ్చి0ది. 

బుడమేరు వాగుపై వెలగలేరు రెగ్యులేటర్‌ గేట్లను ఒకేసారి ఎందుకు ఎత్తాల్సి వచ్చి0ది? మూడు రోజుల ముందే కాస్త ఎత్తి ఉంటే వరద ఎప్పటికప్పుడు వెళ్లిపోయి ఉండేది కదా? వరదను అలా నియంత్రించి ఉంటే తొలుత డైవర్షన్‌ ఛానల్, అక్కణ్నుంచి పోలవరం కెనాల్‌ ద్వారా ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలిసిపోయి ఉండేది. కానీ అలా చేయకుండా వరద ఉద్ధృతి పెరిగాక ఒకేసారి ఎత్తారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఉండడం కోసం అలా చేయడంతో ఆ నీరంతా ఒక్కసారిగా నగరాన్ని ముంచెత్తింది. 

ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు ప్రజల మీద ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా? వారిని ఆదుకోవడం కోసం ఏమైనా అడుగులు వేశాడా? ఏ చర్యలైనా తీసుకున్నాడా? అంటే ఏదీ లేదు. విజయవాడలో ఎక్కడికైనా వెళ్లండి.. ఏ కాలనీ అయినా తీసుకోండి. ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా రిలీఫ్‌ క్యాంపులు లేవు. 

ముందస్తు జాగ్రత్త లేదు.. 
ఈ ప్రాంతంలో అతి భారీ వర్షాలు, వరదలపై గత బుధవారమే ఐఎండీ (వాతావరణశాఖ) హెచ్చరించింది. అప్పుడే జలవనరులు, రెవెన్యూ, హోంశాఖ కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేసి ఉంటే ఈ విపత్తు వచ్చి ఉండేది కాదు. 

ఎగువన ప్రాజెక్టుల వద్ద ఫ్లడ్‌ వాటర్‌ కుషన్‌ ఏర్పాటు చేసి నీటి విడుదలను నియంత్రించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా బుడమేరు నుంచి నీళ్లు వదలడం, ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్‌ క్యాంప్‌లకు తరలించకపోవడం ఇన్ని అనర్థాలకు కారణం. ఇరిగేషన్, రెవెన్యూ, హోం శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కూడా కారణమే.
  


వైఎస్సార్‌సీపీ హయాంలో.. 
మా ప్రభుత్వ హయాంలో గోదావరి జిల్లాలో వరదలొస్తే 40 వేల జనాభా ఉన్న ఊరి నుంచి 36 వేల మందికి పైగా రిలీఫ్‌ క్యాంప్‌లకు తరలించాం. ఏ విపత్తు వ చ్చినా ముందుగానే వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, కలెక్టర్లు అప్రమత్తమయ్యే వారు. ముందుగానే సమాచారం ఇవ్వడంతో పాటు వలంటీర్లు దగ్గరుండి తలుపుతట్టి మరీ ప్రజలను రిలీఫ్‌ క్యాంపులకు తీసుకెళ్లేవారు. ప్రతి సందర్భంలోనూ ప్రజల చేయి పట్టుకుని సహాయ సహకారాలు అందించేవారు. అంతేకానీ ఇప్పటి మాదిరిగా ఏనాడూ ప్రచార ఆర్భాటం చేయలేదు. ఈ సీఎం మాదిరిగా కలెక్టర్‌ ఆఫీస్‌లో పడుకుంటూ అర్థరాత్రి ప్రెస్‌మీట్స్‌ పెట్టలేదు.  

కలెక్టర్లకు వారం టైమిచ్చి
ఏ విపత్తు వ చ్చినా నాడు సహా­యక చ­ర్య­­­లు వేగంగా జరి­గేలా కలెక్టర్లకు పూర్తి అధి­కారంతోపాటు తగిన­న్ని నిధులు కూ­డా కేటాయిస్తూ (టీఆర్‌–­27 కింద కలెక్టర్ల ఖాతా­­­లో జమ) వారం రోజు­లు సమయం ఇచ్చేవాళ్లం. సహా­యక చర్యలకు ఆటంకం కలిగించకూడదన్నదే మా అభిమతం. 

ఆ టైమ్‌ ఇవ్వడం వల్ల వెంటనే కలెక్టర్‌ యాక్టివేట్‌ కావడంతో పాటు వలంటీర్లు, సచివాలయ వ్యవస్థను కూడా క్రియాశీలం చేసి అంతా కలిసి ఒక వ్యవస్థలా పని చేసి ప్రతి బాధితుడికీ అండగా నిల్చేవారు. బాధితులను రిలీఫ్‌ క్యాంప్‌లకు తరలించడం, బాగోగులు చూడడం, అక్కడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు రూ.2 వేల చొప్పున ఇవ్వడం.. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరిగాయి. ఇదంతా కేవలం మా ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్న విషయాన్ని గమనించాలి.  

ఆ రిటైనింగ్‌ వాల్‌ కనుక లేకుంటే.. 
ప్రకాశం బ్యారేజీకి ఏ మాత్రం వరద వచ్చినా మునిగిపోయే కృష్ణలంక, దిగువ ప్రాంతాల వాసుల కష్టాలను స్వయంగా చూసి రూ.500 కోట్లతో కృష్ణలంకకు ఇరువైపులా నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ ఇప్పుడు దాదాపు 3 లక్షల మందిని కాపాడుతోంది. అందుకే మొన్న నేను వారథి మీదుగా వస్తుండగా కృష్ణలంక వాసులు పలుకరించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఆ వాల్‌ కనుక లేకపోయి ఉంటే ఇంకా ఎంత అనర్థం జరిగి ఉండేదో ఆలోచించాలి.  

వారి మరణాలకు సమాధానం చెప్పాలి 
ఈ విపత్తులో ఇప్పటికే 32 మంది చనిపోయారు. మరణించిన వారి పేర్లతో సహా ఆ వివరాలన్నీ పత్రికలో వచ్చాయి.  దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. వరద పూర్తిగా తగ్గితే అన్నీ వెలుగులోకి వస్తాయి. 

ఇంత దారుణంగా ఆర్గనైజేషన్‌ మేనేజ్‌మెంట్‌ అనేది లేకుండా.. ఈ మాదిరిగా వ్యవహరించిన చంద్రబాబు అసలు సీఎం పదవిలో ఉండడానికి అర్హుడినేనా? అని తనకు తాను గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలి. ఈ మరణాలకు వెంటనే బాధ్యత తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి సహాయ చర్యల్లో ముందడుగు వేయాలి.

రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలి
ఇంతమంది మరణానికి కారణమైన సీఎం చంద్రబాబు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మృతుల్లో ప్రతి కుటుంబానికి కనీసం రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. క్షమాపణ కోరుతూ వారందరికీ లేఖ రాయాలి. ఈ వరదల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఇళ్లల్లో సామాన్లన్నీ కొట్టుకుపోయాయి. ఫ్రిజ్‌లు, ఇతర వస్తువులన్నీ పోవడం వల్ల వారంతా చాలా నష్టపోయారు. వరదల వల్ల 6 లక్షల మంది ప్రభావితులైనట్లు వారిచ్చిన రిపోర్ట్‌లోనే ఉన్నందున సామాన్లు కోల్పోయిన ప్రతి ఇంటికి కనీసం రూ.50 వేలు చొప్పున ఇవ్వాలి.

చంటిబిడ్డ జ్వరంతో వణుకుతున్నాడు జగనన్నా..!
ఓ బాలింతరాలి ఆక్రందన.. కనీసం పాల ప్యాకెట్‌ కూడా ఇవ్వలేదయ్యా 
ఆపద వచ్చినప్పుడు కదా ఆదుకోవాల్సింది?.. ఈ ప్రభుత్వం ఉన్నట్లా? లేనట్లా? 
విజయవాడలో వరద నీటిలో మునిగిన పాత ఆర్‌ఆర్‌ పేట, ఎర్రకట్ట దిగువ ప్రాంతంలో పర్యటించి ప్రజల కష్టాలు స్వయంగా విన్న వైఎస్‌ జగన్‌ ఓ ఇంటి వద్దకు చేరుకోగానే షేక్‌ పాషా బేగం అనే బాలింత దీనావస్థ చూసి చలించిపోయారు. తన మూడు నెలల చంటిబిడ్డ షేక్‌ మహమద్‌ అబ్ధుల్లా జ్వరంతో వణుకుతున్నాడని, కనీసం ఒక్క పాల ప్యాకెట్‌ కూడా ఇవ్వలేదు జగనన్నా అని ఆమె రోదించింది. జగన్‌ వస్తున్నట్లు తెలియడంతో ఒకరిద్దరు అధికారులు ఇప్పుడే వచ్చి వెళ్లారని పేర్కొంది.

‘మాది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. ఐదు రోజులుగా నడుం లోతు నీటిలో ఉంటున్నాం. మా ఇంట్లో ముగ్గురు చిన్న పిల్లలున్నారు. చేతిలో చిల్లి గవ్వలేదు. ఐదు రోజులుగా పస్తులున్నా మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు. జగనన్నా..! అదే మీరు ఉండి ఉంటే అధికారులను ఇంటికి పంపి చేతికి డబ్బులిచ్చి ఆహార పదార్థాలు, సరుకులు అందించి ఆదుకునేవారు’ అని కన్నీటి పర్యంతమైంది.

 జ్వరంతో ఉన్న చిన్నారిని వైఎస్‌ జగన్‌ తన చేతిలోకి తీసుకుని బాధితురాలిని ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం పాత ఆర్‌ఆర్‌ పేటలో నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, పోతిన మహేశ్‌ ఆయన వెంట ఉన్నారు.

అధికారులపై వేలెత్తడం హేయం
అధికారులను సీఎం చంద్రబాబు సస్పెండ్‌ చేస్తానంటున్నాడు. అసలు  అధికారులు ఎవరు? ప్రభుత్వం ఎవరిది? ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆయనే దగ్గరుండి ఏ అధికారికి ఎక్కడ పోస్టింగ్‌ ఇవ్వాలి అనేది చెప్పి అన్ని పోస్టింగులు పూర్తి చేశాడు. తానే పోస్టింగులు ఇప్పించుకున్న అధికారుల వల్ల ఇది జరిగిందని సిగ్గు లేకుండా చెబుతున్నాడు! ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఏదన్నా ఉంటుందా? ఆయన తప్పును కప్పి పుచ్చుకునే దాని కోసం అధికారులను బలి పశువులను చేస్తున్నాడు. అన్నింటికీ కారణం నువ్వు అయినప్పుడు.. నువ్వు తప్పు చేసినప్పుడు.. దాన్ని హుందాగా అంగీకరించి ప్రజలను  క్షమాపణ అడుగు. 

నిజాయితీఉంటేచూపించండి.. 
మీరంతా విలేకరులు..ఒకసారి నేరుగా వెళ్లి మీరే చూడండి. ఇదే విషయం వాళ్ల పాంప్లెట్‌ పేపర్‌ ఈనాడులోనూ వచ్చింది. దయచేసి జర్నలిజంలో న్యాయం, ధర్మం కొంచమైనా పాటించి వాళ్ల గెజిట్‌ పేపర్‌ ఈనాడులో వచ్చిన ఆ వార్తను ఒక్కసారి మీ టీవీల్లో చూపించండి. వాళ్లంతట వాళ్లే వెలగలేరు రెగ్యులేటర్‌ గేట్లు ఎత్తారు. అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకెత్తారట! అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చాయట! అవన్నీ వాళ్లు రాసిన మాటలే. దయచేసి జర్నలిజంలో ఏ మాత్రం నిజాయితీ, న్యాయం ఉన్నా  ఆ వార్త కూడా పెట్టమని అడుగుతున్నా.

గోదావరి పుష్కరాల తరహాలోనే..
విజయవాడ విపత్తు క చ్చితంగా మ్యాన్‌ మేడ్‌ ఫ్లడ్‌.  గతంలో గోదావరి పుష్కరాల్లో కూడా చంద్రబాబు తన షూటింగ్‌ కోసం, తాను ఒక హీరోలా కనిపించాలనే తాపత్రయంతో చేసిన హంగామాలో తొక్కిసలాట జరిగి  29 మంది దుర్మరణం చెందారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగానే చంద్రబాబు తప్పిదం వల్లే 32 మంది చనిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement