YV Subba Reddy And Botsa Satyanarayana On MLC Elections - Sakshi
Sakshi News home page

పట్టభద్రులు వైఎస్సార్‌సీపీ వైపే

Published Thu, Feb 23 2023 4:27 AM | Last Updated on Thu, Feb 23 2023 11:35 AM

YV Subba Reddy And Botsa Satyanarayana On MLC Elections - Sakshi

మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి, చిత్రంలో మంత్రులు బొత్స, అమర్‌నాథ్‌ తదితరులు

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా వైఎస్సార్‌సీపీ మద్దతిస్తున్న సీతంరాజు సుధాకర్‌ గెలుస్తారని టీటీడీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వై.వి.సుబ్బారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.

వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రులంతా వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారని చెప్పారు. సీతంరాజు సుధాకర్‌ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నాలుగేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, విదేశీ విద్యాదీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాల ద్వారా అనేకమంది విద్యార్థులు లబ్ధిపొందారని.. వారంతా వైఎస్సార్‌సీపీ మద్దతిస్తున్న సుధాకర్‌ను గెలిపిస్తా­రని చెప్పారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమం, అభివృద్ధి రెండూ ఎమ్మెల్సీ విజయాన్ని అందిస్తాయని చెప్పారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల కోసం ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాలను బెదిరించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవన్నీ అవాస్తవాలని ఖండించారు. అది కేవలం ఓటమి భయంతో చంద్రబాబు అండ్‌ కో టీం చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే­నని చెప్పారు.

ఒక వేళ తమ పార్టీ నుంచి ఎవరైనా బెదిరించినట్లు  ఫిర్యాదు చేశారా? అని అడిగారు. అలాంటివి ఏమైనా ఉంటే ఎన్నికల కమిషన్‌ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం జగన్‌ మాటల్లో కాదు.. చేతల్లో సామాజిక న్యాయం చూపించారని చెప్పారు. బలహీనవర్గాలకు చెందిన వారినే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, వేణుగోపాలకృష్ణ, ఎంపీ భీశెట్టి సత్యవతి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పెట్ల ఉమాశంకర్‌గణేష్, గొల్ల బాబూరావు, బొత్స అప్పలనర్సయ్య, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కె.కె.రాజు, పార్టీ సమన్వయకర్త ఆడారి ఆనంద్, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement