మహిళా చేయూత మార్టు
ఖాజీపేట : మహిళలు తలచుకుంటే ఏదైనా సాధిస్తారు .. అందుకు నిదర్శనం ఖాజీపేటలోని మహిళా చేయూత మార్ట్ చెప్పవచ్చు.. నేటి పోటీ వ్యాపారంలో తట్టుకుని అందరికన్నా భిన్నంగా.. ఆలోచిస్తూ తక్కువ ధరకే సరుకులతో పాటు నాణ్యమైన శుభ్రమైన సరుకులు వినియోగదారులకు ఇస్తున్నారు.
ఫలితంగా వ్యాపారం బాగా వృద్ధి చెందడంతోపాటు మంచి లాభాలను గడిస్తున్నారు. ఫలితంగా ఇతర మహిళా మార్టులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 15 మహిళా మార్టులను ఏర్పా టు చేయాలని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఖాజీపేటను ఎంపిక చేశారు. మహిళా మార్టు ఏర్పాటుకు పెట్టుబడిగా ప్రతి సభ్యురాలు రూ.300 చొప్పున గ్రూపు నుంచి రూ. 3వేలు వసూలు చేశారు. ఇలా మండలంలో 950 గ్రూపులకు గాను రూ. 23లక్షలు పెట్టుబడిగా వచ్చింది. 2022 నవంబర్ 28న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేతుల మీదుగా మహిళా మార్టును ప్రారంభించారు.
విజయవంతంగా..
ఖాజీపేట లాంటి చోట మహిళామార్టులు విజయవంతంగా నడుస్తాయా అని అందరూ భావించారు. అయితే డ్వాక్రా మహిళల సహకారం.. అధికారుల పర్యవేక్షణతోపాటు మార్కెట్‌లో లభించే ధరలకంటే తక్కువ ధరకు, నాణ్యమైన సరుకులను వినియోగదారులకు అందించేలా సిబ్బంది కృషి చేశారు. ఫలితంగా 5 నెలల్లోనే రూ.కోటికి పైగా వ్యాపారం చేస్తూ విజయవంతంగా మహిళామార్టు నడుస్తోంది.
లాభాలు అన్నీ సభ్యులకే
మహిళా మార్టులో జరిగే వ్యాపారం వల్ల వచ్చే లాభాలు అన్ని మార్టులో పెట్టుబడి పెట్టిన సభ్యులకే. ప్రతి సంవత్సరం వచ్చిన ఆదాయంలో ఖర్చులను తీసి వచ్చిన ఆదాయాన్ని ప్రతి సభ్యురాలికి అందజేస్తామని అధికారులు అంటున్నారు. ప్రతి నెల ఆడిటింగ్ జరుగుతుందని వారు చెబుతున్నారు.
మార్చికల్లా 15 మార్టుల ఏర్పాటు
జిల్లాలో 15 మార్టులను ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. ఖాజీపేటలో విజయవంతం కావడంతో వేంపల్లి, పోరుమామిళ్ల, బద్వేలులో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే స్థల పరిశీలన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment