మదనపల్లె : రోజురోజుకీ ప్రజాదరణ కోల్పోతున్న టీడీపీ పబ్లిసిటీ పిచ్చితో ఎంతటి బరితెగింపుకై నా సిద్ధపడుతోంది. అధికార పార్టీ నేతలపై దుష్ప్రచారం చేయడంలో పచ్చ పార్టీ ఎంతకై నా తెగిస్తోంది. మూడురోజుల క్రితం మదనపల్లె మండలంలో ఓ మైనర్ బాలుడిపై అతడి స్నేహితులు దాడికి పాల్పడితే.. ఆ ఘటనను సైతం టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో కులప్రస్తావన తీసుకువచ్చి ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారంటూ సోషల్ మీడియా ట్విట్టర్‌లో తప్పుడు ప్రచారాన్ని మొదలెట్టింది. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి ఉన్న ప్రతిష్టను, క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ఇలాంటి చీప్‌ట్రిక్కులను ప్రయోగిస్తోంది. ఘటనకు సంబంధించిన వివరాలు..
పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన వెంకటరమణ, అంజలి దంపతుల కుమారుడు ఆదిరామమూర్తి(17) ప్రశాంత్‌నగర్‌లోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇతడు అదే కాలనీకి చెందిన ప్రవీణ్‌కుమార్‌తో గొడవపడ్డాడు. దీన్ని మనస్సులో పెట్టుకున్న ప్రవీణ్ ఈనెల 17న ఆదిరామమూర్తిని సీటీఎంలో స్నేహితులు జరుపుతున్న తన పుట్టినరోజు వేడుకలకు రావాల్సిందిగా కోరాడు. తన ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని తీసుకువెళ్లాడు. అక్కడ ప్రవీణ్‌తో పాటుగా మదనపల్లె రామారావుకాలనీకి చెందిన రక్షిత్, చందూ, సీటీఎం నేతాజీకాలనీకి చెందిన నౌషాద్, హేమంత్‌బాబులు కలిసి ఆదిరామమూర్తిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
తాము కొడుతున్న దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. ఈ ఘటనపై బాధితుడు తాలూకా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా తనను పట్టించుకోలేదంటూ 19న మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో తల్లిదండ్రులతో కలిసి విలేకరుల సమావేశంలో చెప్పాడు. తమకు న్యాయం జరగకపోతే వడ్డెరసంఘం ఆధ్వర్యంలో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. మరుసటిరోజు పత్రికల్లో ఈ విషయమై వార్తలు రావడంతో స్పందించిన తాలూకా పోలీసులు దాడికి పాల్పడిన నిందితులపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
అయితే ఈ సంఘటనను టీడీపీకి చెందిన నాయకులు తమకు అనుకూలంగా వడ్డెర కులానికి చెందిన మైనర్‌బాలుడిపై ఎమ్మెల్యే అనుచరులు అమానుషంగా దాడికి పాల్పడ్డారంటూ తెలుగుదేశం పార్టీ జై టీడీపీ ట్విట్టర్ అకౌంట్లో వీడియోను పోస్ట్‌చేసి అసత్యప్రచారానికి పూనుకున్నారు. ఘటనలో పాల్గొన మైనర్ బాలురు సాధారణ దినసరికూలీ, కార్మిక కుటుంబాలకు చెందిన వారు. వీరికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. మైనర్‌బాలురకు, వారి కుటుంబాలకు రాజకీయాలతో కానీ పార్టీలతో కానీ ఎలాంటి సంబంధం లేకున్నా... జరిగిన ఘటనకు ఏమాత్రం సంబంధంలేని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అనుచరులను బాధ్యులను చేస్తూ టీడీపీ నీచ,కుట్ర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి చీప్‌ట్రిక్స్ మానుకోకపోతే భవిష్యత్తులో టీడీపీకి తీవ్ర నష్టం తప్పదని, పచ్చపార్టీ నాయకులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment