సాక్షి ప్రతినిధి, కడప: వినేవారు లోకువైతే చెప్పేవాడు చంద్రబాబు అన్నది విశ్లేషకుల నానుడి. ఇప్పుడు సరిగ్గా ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారు చంద్రబాబు తనయుడు నారా లోకేష్. నాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి మానసిక క్షోభకు గురిచేసి, ఆయన మరణానికి దారితీసిన పరిస్థితుల్ని చంద్రబాబు అండ్‌కో సృష్టించారు. ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి వేడుకల పేరుతో ఆయా నేతలే హంగామా చేశారు. అప్పటి ఉదంతాన్ని ‘మిషన్ రాయలసీమ’ గుర్తు చేస్తోంది. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ కడపలో ప్రకటించిన ‘మిషన్ రాయలసీమ’ డిక్లరేషన్‌పై నాడు ఎన్టీఆర్ పట్ల అలా... నేడు రాయలసీమ విషయంలో ఇలా... నక్క వినయం ప్రదర్శిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
విభజన ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నన్నాళ్లు రాయలసీమను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అదేమంటే రాయలసీమలో తమకు ఓట్లు, సీట్లు ఇవ్వరని, అందుకే అభివృద్ధి చేయలేదని నిర్లజ్జగా ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు పాణ్యంలో బహిరంగంగా ఆ విషయాన్ని వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఒక్కరే అన్న నగ్న సత్యాన్ని విస్మరించి వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు చంద్రబాబు. నిర్దిష్ట అభివృద్ధి సాధించే అవకాశం ఉన్నా టీడీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని పలువురు వాపోతున్నారు.
గతమంతా రాయలసీమ పట్ల నిర్లక్ష్యమే..
1995–2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 2014–19 విభజన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రాయలసీమ పట్ల పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులంటే మండిపడేవారు. తాజాగా 25 టీఎంసీలు నీటి నిల్వకు కారణమైన గండికోట ప్రాజెక్టును ఉమ్మడి ఏపీలో అప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలోకి చేర్చిన చరిత్రను చంద్రబాబు మూట గట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు నీరు చేరాలంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ ఒక్కటే మార్గమని తలచారు. అలా చేస్తేనే కాస్తో, కూస్తో రాయలసీమ ప్రాంతానికి నీరు చేరుతుందని మనస్ఫూర్తిగా నమ్మారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్సార్ సర్కార్ పెంచుతుంటే, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేసింది చంద్రబాబు కాదా అని ఈ ప్రాంత వాసులు నిలదీస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాతైనా రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తారంటే ఐదేళ్ల కాలం ఊకదంపుడు ఉపన్యాసాలతో సరిపెట్టారని పలువురు గుర్తు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కడపలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం పాస్ చేసిన బిల్లు మేరకు ఏర్పాటు చేయలేకపోయారు. పైగా సీఎం హోదాలో ఈ ప్రాంతంలో పర్యటించిన ప్రతిసారి చంద్రబాబు హార్టికల్చర్ హబ్, టూరిజం సర్క్యూట్, మైనింగ్ డెవలప్‌మెంట్ ఇలా చెప్పిందే చెప్పి రాయలసీమ ప్రజలను ఊరించారు. తాజాగా ఆ జాబితాలోకి నారా లోకేష్ వచ్చి చేరిపోయారని పలువురు విమర్శిస్తున్నారు.
పిన్నమ్మకు బంగారు గాజులు...
టీడీపీ అధినేత చంద్రబాబు గురించి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న మాటలను జనం గుర్తు చేసుకుంటున్నారు. ‘అమ్మకు అన్నం పెట్టని వాడు, పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అన్నారట’ అని బాబు వైఖరిని ఒక్క మాటలో అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆవిష్కరించారు. ఇప్పుడు నారా లోకేశ్ రాయలసీమ మిషన్ పేరుతో ఇస్తున్న హామీలు పెద్దబాబు గురించి వైఎస్సార్ చెప్పిన చందంగా ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. రాయలసీమలో పుట్టి పెరిగిన చంద్రబాబునాయుడు 14 ఏళ్లపాటు సీఎంగా పని చేసి, సొంత ప్రాంతానికి ఏమీ చేయకపోవడం వల్లే సీమకు ఈ దుస్థితి అని లోకేశ్‌కు తెలియదా? అని మేధావులు మండిపడుతున్నారు. కేవలం రాజకీయ బతుకుల్ని మార్చుకునేందుకే మిషన్ రాయలసీమ అంటూ మాయమాటలు చెబుతున్నారని, ఇప్పటికీ రాయలసీమ పట్ల వివక్ష లేకపోలేదని పలువురు వెల్లడిస్తున్నారు. కొత్త నగరాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కోరగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ కొప్పర్తిని ఎంపిక చేసింది. అమరావతిని ఎంపిక చేయకుండా కొప్పర్తి ప్రతిపాదనలు పంపారని సన్నాయి నొక్కులు ఎల్లోబ్యాచ్ అందుకుంది. కనీసం కర్నూలులో హైకోర్టు ఇస్తామని లోకేశ్ హామీ ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. పెద్దబాబు, చినబాబు మాయమాటలు నమ్మే అమాయక స్థితిలో సీమ ప్రజలు లేరనే అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
అధికారం కోసమే మిషన్ రాయలసీమ
అధికారంలో ఉంటే చంద్రబాబునాయుడు కళ్లు లేని కబోదిలా ఉంటారు. అధికారం లేకపోతే అసంబద్ధ ప్రేలాపనలు చేయడం టీడీపీ నేతలకు సర్వసాధారణం. విజన్ 2020 అలాంటిదే. 2000 సంవత్సరంలో విజన్ 2020 ప్రకటించారు. ఆమేరకు పాలన చేసి ఉంటే 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఉండేది కాదు కదా? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ చేయాలనే ఆలోచన టీడీపీ సర్కార్‌కు ఎందుకు రాలేదు? వైఎస్సార్ సర్కార్ పోతిరెడ్డిపాడు విస్తరణ చేసింది కాబట్టే, ఈరోజు రాయలసీమకు నీరు వస్తోంది. పెద్దబాబు బాటలోనే చినబాబు కూడా పయనిస్తున్నారు. –టి శివప్రసాద్, ఎకనామిక్స్ ప్రొఫెసర్
ఏ మిషన్ చినబాబు? ఓట్ల మిషనా... సీట్ల మిషనా?
కృష్ణా డెల్టా రైతులకు మూడు కార్ల పంటల కోసం జీఓ నంబర్ 69 ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం ఎత్తు 835 అడుగులకు తగ్గిస్తూ సీఎం హోదాలో చంద్రబాబు నాడు నిర్ణయం తీసుకుని రాయలసీమ ప్రజల గొంతు పిసికారు. పాత కాలువలకు గండ్లు కొట్టి మోటార్లు బిగించి జాతికి అంకితం చేయడం తప్పా, మొన్నటి తొమ్మి దేళ్ల పాలన, నిన్నటి ఐదేళ్ల పాలనలో రెయిన్ గన్లతో కరువు పార దోలడం కాకుండా చంద్రబాబు పూర్తి చేసిన ప్రాజెక్టు ఏమైనా ఉందా? ఉదయం లేచింది మొదలు నిత్యం అమరావతి మంత్రం జపిస్తూ, మనసా వాచా కర్మనా వికేంద్రీకరణను వ్యతిరేకించే మీరు రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తామంటే నమ్మాలా? రాష్ట్రంలో ఏమూలన చీమ చిటుక్కుమన్నా రాయలసీమ రౌడీలు, గూండాలంటూ ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నారు. వర్తమానంలో మీరు చేస్తున్నదంతా, భవిష్యత్తులో మీరు చేయబోతున్నదంతా అద్భుతమే అనడం మీ అవకాశవాదం. –వివేక్ లంకమల, సామాజికవేత్త
Comments
Please login to add a commentAdd a comment