పెద్దతిప్పసముద్రం : మండలంలోని పులికల్లు సమీపంలో మంగళవారం ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంలో రైతు నరసింహులుకు రూ.4 లక్షల నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే మద్దయ్యగారిపల్లి పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ నరసింహులు పులికల్లు సమీపంలో నాలుగు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట సాగుచేస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పురవ్వలు పంటపై వేయడంతో మంటలు వ్యాపించాయి. ఈ తరుణంలో రెండు ఎకరాల్లో పంట దెబ్బ తినడంతోపాటు స్టాటర్, డ్రిప్ పైపులు, పైప్‌లైన్, ల్యాడర్లు, బోరు కేసింగ్ పైపులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ములకలచెరువు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు పేర్కొన్నాడు.
కొట్టం దగ్ధం
గాలివీడు : మండలంలోని ఇడపన్‌చేనుపల్లెకు చెందిన కె.లోకేష్‌రెడ్డికి చెందిన బోద కొట్టం మంగళవారం మధ్యాహ్నం దగ్ధమైంది. ఇందులో నిల్వ ఉంచిన రూ.50 వేల విలువ చేసే ఉలవలు కాలిపోయినట్లు తెలిపారు. అధికారులు ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో
జరిమానా
కలకడ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఐదుగురు ద్విచక్రవాహన దారులపై కేసు నమోదు చేసి వాల్మీకిపురం సివిల్ కోర్టులో హాజరుపరిచనట్లు ఎస్‌ఐ రామాంజ నేయులు తెలిపారు. న్యాయమూర్తి ఒక్కొక్కరికి రూ.11వేల జరిమానా విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
పాత కక్షలతో వ్యక్తిపై దాడి
ఒంటిమిట్ట : మండలంలోని చిన్నకొత్తపల్లి గ్రామంలో సోమవారం బుడుసు హరి అనే వ్యక్తిపై దాడి చేసిన విషయం విదితమే. ఈ ఘటనపై ఒంటిమిట్ట ఎస్‌ఐ శివ ప్రసాద్ మంగళవారం కేసు నమోదు చేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. హరి అనే వ్యక్తిపై గత కొంతకాలంగా పాతకక్షలు పెట్టుకున్న నంద్యాల ఆకాష్, అజయ్, రమేష్, వెంకటేష్ సోమవారం చిన్న కొత్తపల్లికి వెళ్లారు. ఒంటరిగా ఆటోలో వస్తున్న హరిని కాపు గాసి రోకలి కర్రతో దాడి చేశారు. ఈ దాడిలో బుడుసు హరికి కాళ్లు, కుడిచేయి, తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. కడప రిమ్స్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
22న జాతీయ సదస్సు
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వ విద్యాలయంలో ఈ నెల 22న ఉర్దూ కవిత, సాహిత్యం్ఙపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉర్దూ విభాగం ఆచార్యులు రియాజున్నీసా తెలిపారు. సదస్సులో ఉర్దూ సాహిత్యం, దాని ప్రాముఖ్యత, ఉర్దూ స్థితి, కడపలో ఉర్దూ సాహిత్యంతిపై చర్చ జరుగుతుందని తెలిపారు. సాహిత్య వర్గాలు, అధ్యాపకులు, విద్యార్థులంతా సదస్సులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదనపు సమాచారం కోసం 9885348482లో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment