మామిడి రైతుకు ఏదీ భరోసా..? | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతుకు ఏదీ భరోసా..?

Published Thu, Feb 20 2025 12:18 AM | Last Updated on Thu, Feb 20 2025 12:15 AM

మామిడి రైతుకు ఏదీ భరోసా..?

మామిడి రైతుకు ఏదీ భరోసా..?

రాష్ట్రంలో మామిడి చెట్ల పెంపకం, మార్కెటింగ్‌లో అన్నమయ్య జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. చిత్తూరు జిల్లాకు సమానంగా అన్నమయ్య జిల్లా మామిడికి ప్రసిద్ది చెందింది. ఈ సారి మామిడి విక్రయాలకు భరోసా లేకుండా పోతోంది. రాయచోటి, కోడూరులలో మార్కెటింగ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినా నేటికీ అమలు కాలేదు. కొనుగోలు కోసం దళారుల వైపు చూడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ సారైనా ప్రభుత్వ పరంగా గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రాయచోటి : అన్నమయ్య జిల్లాలోనే 34వేల హెక్టార్ల లో వివిధ రకాల మామిడి తోటలు సాగులో ఉన్నాయి. రాయచోటి, రాజంపేట, కోడూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలలో పోటాపోటీగా మామిడి తోటలను సాగు చేశారు. దిగుబడి కూడా జిల్లాలో అధికంగానే ఉంటుంది. తెగుళ్ల బెడదతో రెండేళ్లుగా మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఈ ఏడాది వాతావరణంలో మార్పులు, వెంటాడుతున్న తెగుళ్లతో పూత, పిందె దశలలో ఉంది. పూత మురిపిస్తున్నా ఆశించిన మేర ఎదుగుదల లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. తెగుళ్ల నివారణకు రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్‌లో లభించిన మందులన్నింటినీ చల్లుతున్నారు. కొంతమంది రైతులు మామిడి పిందెలకు కవర్లు కట్టి రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు.

దళారుల బెడదతో ఇబ్బందులు

సవాళ్ల మధ్య తోటలను కాపాడుకుంటున్నా.. సరియైన గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి వ్యాపారులు, దళారులు రావడం, వారు నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయడం, ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలించి సొమ్ముచేసుకోవడంతో తాము నష్టపోతున్నామని చెబుతున్నారు. గతంలో ఉన్న మామిడి రైతుల ఉత్పత్తి సమైక్య కేంద్రాలు సక్రమంగా పనిచేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపంతో కొనుగోలుపై స్పష్టత లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. గత వైకాపా పాలనలో రాయచోటి, కోడూరులలో మార్కెటింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. అసలే తెగుళ్ల బెడదతో సక్రమంగా దిగుబడి రావడం లేదని, ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసి న్యాయం చేయాలంటూ మామిడి తోట రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.

దళారులతో దగా పడుతున్న

మామిడి రైతులు

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

మామిడి రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మామిడి మామిడి ధరల విషయంలో స్థానిక జ్యూస్‌ కంపెనీలతో చర్చించడం జరుగుతుంది. తెగుళ్లను నివారించుకొని అధిక దిగుబడులు వచ్చేలా సాగులో తగు మెలకువలు పాటించాలి.

– రవీంద్రబాబు, జిల్లా ఉద్యాన అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement