వక్ఫ్‌బోర్డు పేరుతో భూముల కబ్జా
సాక్షి టాస్క్‌ఫోర్స్ : వక్ఫ్ బోర్డు పేరుతో పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో భూములు కబ్జా చేసి అనుమతి లేకుండా దుకాణాలు నిర్మించారు... వాటిని సబ్ లీజుకు ఇచ్చేసి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రారంభానికి వచ్చిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ.సిసోడియాను కలిసి, ఎమ్మెల్యే అక్రమాలపై స్థానికులు ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ నుంచి పట్టణానికి చెందిన వ్యక్తి 20 హవాన్సులకు కొనుగోలుచేశారన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా వక్ఫ్ బోర్డు పేరుతో భూములను కబ్జా చేశారన్నారు. దుకాణాలు నిర్మించి అద్దె వసూళ్లుకు ఆయనే కమిటీ ఏర్పాటు చేశారన్నారు. జామియా మసీదుకు చందా ఇచ్చినట్లుగా రసీదు అందజేస్తున్నారన్నారు. వక్ఫ్‌బోర్డు స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో రికార్డులన్నీ అధికారుల వద్ద ఉంటే, అధికారం చెలాయిస్తూ అద్దెలు వసూళ్లు చేసుకుని కోట్ల రూపాయలు కాజేస్తున్నారన్నారు. వక్ఫ్‌భూముల్లో నిర్మించిన షాపు అద్దెలు అటు ప్రభుత్వానికి, ఇటు యజమానులకు వెళ్లక మధ్యలో ఉన్న వారు కాజేస్తున్నారని వాపోయారు. దాదాపు 20 కోట్ల మేర వసూళ్లకు సంబంధించి లెక్కలు తేలాల్సి ఉందన్నారు. మున్సిపల్ కమిషనర్‌ను ఆర్టీఐ కింద అడిగితే, అనుమతులు లేవని సమాధానమిచ్చారన్నారు. బెంగళూరు బస్టాండ్ బడేమకాన్ వద్ద 1893 నుంచి పట్టా కలిగినటువంటి సయ్యద్ బాసిద్ బాషాకు చెందిన సర్వే నెంబర్.173లోని 97 సెంట్ల భూమిని ఆక్రమించి ఆధీనంలో పెట్టుకుని, మున్సిపల్ అనుమతి లేకుండా షాపురూములు నిర్మించి అద్దెలు తీసుకుంటున్నారన్నారు. అలాగే సర్వేనెంబర్.171లోనూ స్థలాన్ని కబ్జాచేసి, అనుమతి లేకుండా భవనాన్ని నిర్మించుకున్నారన్నారు. దీనిపై సీసీఎల్‌ఏ, హైకోర్టు, సింగిల్‌బెంచ్ కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ, స్థలంలోకి ప్రవేశించకుండా దౌర్జన్యం చేస్తున్నారన్నారు. వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని, జిల్లా అధికారులను లోబర్చుకుని, డబ్బు దోచుకుంటూ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా స్వలాభం చూసుకుంటున్నారన్నారు. ఏడునెలలు కావస్తున్నా..తమకు న్యాయం జరగకపోవడంతో మరోసారి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమ ఆవేదన తెలుపుకొన్నామన్నారు. ఫిర్యాదుచేసిన వారిలో వెంకటరమణనాయుడు, శంకర్‌రెడ్డి, సయ్యద్ బాసిద్‌బాషా, షరీఫ్, ముస్లిం మహిళలు ఉన్నారు.
అన్ ఆథరైజ్డ్ కమిటీ ద్వారా
అక్రమ వసూళ్లు
మతం ముసుగులో కోట్ల రూపాయల స్కామ్
ఎమ్మెల్యే అక్రమాలపై
ఆర్.పీ.సిసోడియాకు ఫిర్యాదు
20కోట్ల మేర లెక్కలు తేల్చాలంటున్న బాధితులు
వక్ఫ్‌బోర్డు పేరుతో భూముల కబ్జా
Comments
Please login to add a commentAdd a comment