
విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
గాలివీడు : చెట్టు కొమ్మ విరిగి పడిన ఘటనలో స్కూల్ విద్యార్థులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత కథనం మేరకు.. మండల పరిధిలోని వెలిగల్లు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉదయం 8.40 గంటల ప్రాంతంలో విద్యార్థులు ప్రార్థన చేసేందుకు పాఠశాల మైదానంలో ఉన్న చెట్ల కింద నిల్చున్నారు. అయితే అక్కడే ఎత్తుగా ఉన్న సుంకేసుల చెట్టుకు ఉన్న పెలుసుబారిన బలమైన కొమ్మ ఒకటి ప్రమాదవశాత్తు విరిగి పడటంతో ఒక్కసారిగా విద్యార్థులు ఉలిక్కి పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థినులకు స్వల్పంగా రెమ్మలు తాకడంతో చర్మంపై గీచులు పడ్డాయి. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించామన్నారు. అదృష్టవశాత్తు విద్యార్థులకు పెద్ద పెను ప్రమాదం తప్పిందంటూ ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment