17న గ్రామ పంచాయతీ కార్మికుల చలో విజయవాడ
రాయచోటి అర్బన్ : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకట్రామయ్య తెలిపారు. మంగళవారం రాయచోటి మండలం చెన్నముక్కపల్లె గ్రామం పీటీఎం పల్లెలో జరిగిన జిల్లా స్థాయి పంచాయతీ కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను కార్మికులతో కలిసి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కార్మికులకు 3 నుంచి 9 నెలల వరకు వేతన బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. కార్మికుల పేరుమీద ఈఎస్‌ఐ, పీఎఫ్‌లకు నిధులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు రామాంజులు, ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రీన్ అంబాసిడర్‌లకు జీతాలుగా కొన్ని పంచాయతీలు పూర్తిగా చెల్లించలేదన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు దేవరాయలు, ఏ.వి.రమణ, అంజి, మురళి, రెడ్డెయ్య, సుభద్ర, లక్ష్మిదేవి, గంగులు, శ్రీరాములుతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment