టీడీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమాలపై ఆగ్రహం
మదనపల్లె : పాతికేళ్ల క్రితం తాము కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ అధికార బలంతో అక్రమంగా పొందిన 1బీ అడంగల్‌ను రద్దుచేసి తమకు న్యాయం చేయాలని చేనేత కార్మికులు వేడుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిస్థలాలను ఆక్రమించి, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంపై మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. కార్యాలయం ఎదుట బైఠాయించి, లోపలకి ఎవ్వరిని వెళ్లనీయకుండా అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీకే.పల్లె రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 423/2లో కొండుపల్లె యశోదమ్మ, కొండుపల్లె శ్రీనివాసులు, కె.రెడ్డెప్ప నుంచి 77 మంది చేనేత కార్మికులు ప్లాట్ల రూపంలో వేసిన లే అవుట్‌లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశామన్నారు. ఇందులో కొందరు ఇళ్లు నిర్మించుకోగా, మరికొందరు పునాదులు వేసుకుని, స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. ఈ స్థలాన్ని ఎలాగైనా కాజేయాలనే దురుద్దేశంతో రికార్డులు తనిఖీ చేసుకోకుండా, తమను సంప్రదించకుండా 2020 సంవత్సరం డిసెంబర్ 1న దేశిరెడ్డి హరినాథరెడ్డి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ) తీసుకుని, ప్లాట్ల రూపంలో అమ్మిన భూమిని, వ్యవసాయభూమిగా పేర్కొంటూ 2025 జనవరి 29న టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ డాక్యుమెంట్ నెంబర్.962/2025 కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. తర్వాత అక్రమంగా భూమిలోకి ప్రవేశించి, పాతికేళ్లుగా ఉన్న తమను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా బెదిరిస్తూ దౌర్జన్యంతో చుట్టూ కంచె నిర్మించాడన్నారు. ఈ విషయమై తాము ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, తహసీల్దార్‌లను కలిసి తమగోడును వివరించి న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించామన్నారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, సబ్ రిజిస్ట్రార్ గురుస్వామిని పిలిచి రిజిస్ట్రేషన్ రద్దుచేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని ఆదేశించారన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో 1బీ, అడంగల్ ఆన్‌లైన్‌లో ఉన్నందునే తాను రిజిస్ట్రేషన్ చేశానని సబ్ రిజిస్ట్రార్ చెప్పిన నేపథ్యంలో వాటిని రద్దుచేయాల్సిందిగా అధికారులకు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశామన్నారు. అయితే మూడు వారాలు అవుతున్నా ఇప్పటివరకు అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు న్యాయం జరగని పక్షంలో తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యాలయ తలుపులు మూయడంపై వివాదం..
న్యాయం చేయాలని బాధితులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కూర్చుని నిరసన తెలుపుతుంటే, అధికారులు పట్టించుకోకపోగా.. లోపలకు ఎవ్వరినీ అనుమతించకుండా .కార్యాలయం తలుపులు వేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆడవాళ్లు, చేనేతకార్మి కులు నిరసన తెలుపుతున్నా, పట్టించుకోకపోవడంపై నిలదీశారు. దీంతో తహసీల్దార్, కార్యాలయం ఎదుట న్యూసెన్స్ చేస్తున్నారని, పోలీసులను పిలిపించారు. నిరసన తెలిపిన వారిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా కోరారు. దీనిపై బాధితులు తాము న్యాయం కోసం మాత్రమే వచ్చామని, తమ భూమిపై అక్రమంగా మంజూరుచేసిన 1బీ అడంగల్‌ను రద్దుచేస్తే చాలని వేడుకున్నారు. తహసీల్దార్ ధనంజయులు మాట్లాడుతూ...పని ఒత్తిడి అధికంగా ఉండటంతో కార్యాలయం తలుపులు వేసుకుని లోపల పనిచేస్తున్నామని, ఆఫీసు వేళల్లో ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్, బాధితులతో మాట్లాడారని, ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిందిగా సూచించారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట
బాధితుల ధర్నా
అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment