గుర్రంకొండలో భారీగా గంజాయి స్వాధీనం
గుర్రంకొండ : మండల కేంద్రమైన గుర్రంకొండలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ఇప్పటికే గంజాయి ముఠా సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. గత కొంత కాలంగా గుర్రంకొండలో గంజాయి ముఠా సభ్యుల కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. యథేచ్ఛగా గంజాయి అమ్మకాలతో పాటు వినియోగించేవారు రోజురోజుకు ఎక్కువైపోతు న్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు గంజాయికి ఎక్కువగా బానిసలు అవుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో స్థానిక తెలుగు జెడ్పీ హైస్కూల్, తెలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన, పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా దుకాణాల సముదాయం గంజాయి కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. పలువురు గంజాయి ముఠా సభ్యులు ఈ దుకాణాల్లో గంజాయిని స్టాకు ఉంచుకొని నిత్యం సేవిస్తూ మత్తుగా తూలి అక్కడే ఉన్న సమాధులపై పడిపోతున్నారు. దీంతో గంజాయి కార్యకలాపాల జోరుపై సమాచారం అందుకున్న స్పెషల్ బ్రాంచి పోలీసులు, వాల్మీకిపురం, గుర్రంకొండ పోలీసులు బృందంగా ఏర్పడి గత రాత్రి ముందుగా అందుకున్న సమాచారం ప్రకారం పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఓ వెల్డింగ్ దుకాణంలో ముకుమ్మడి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రెండు కిలోల గంజాయి పార్సిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సదరు వెల్డింగ్ దుకాణం యజమానిని అప్పటికప్పుడు అదుపులోకి తీసుకొని పోలీసులు రహస్య ప్రదేశంలో విచారణ నిర్వహించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. గతంలో రెండు మార్లు గంజాయి కేసుల్లో నింతులుగా ఉన్న ముఠా సభ్యులే ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. సదరు ముఠా సభ్యుడు ఒకడు వెల్డింగ్ దుకాణంలో స్టాకు ఉంచి ప్రతి రోజు కొద్దికొద్దిగా వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని వెల్డింగ్ దుకాణం యజమాని పోలీసుల వద్ద అంగీకరించినట్లు తెలిసింది. ఇప్పటికే పట్టుబడిన ముఠాసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు ఇందులో ఎవరెవరు ఉన్నారనే విషయం పసిగట్టి పలువురు ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడిన విషయం పట్టణంలో సంచలనం రేకెత్తించింది. సాక్షాత్తు వందలాది మంది చదువుకునే విద్యాలయాలకు పక్కన, పోలీస్ స్టేషన్‌కు ఎ దురుగా ఉన్న ఓ దుకాణంలోనే గంజాయి పట్టుబడిన విషయం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఎస్‌ఐ మధురామచంద్రుడును వివరణ కోరగా గత సోమవారం రాత్రి పోలీసుల దాడుల్లో కొద్దిగా గంజాయి పట్టుబడిందన్నారు. ఇందులో ఉన్న ముఠాసభ్యుల్ని విచారిస్తున్నామని త్వరలోనే వీరందరిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
పోలీసుల అదుపులో ముఠా సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment